తెలంగాణ

telangana

By

Published : Sep 8, 2019, 3:29 PM IST

Updated : Sep 29, 2019, 9:33 PM IST

ETV Bharat / bharat

'మోదీ 2.0: వంద రోజుల దౌర్జన్యం, గందరగోళం, అరాచకం'

మోదీ సర్కార్ 100 రోజుల పాలనపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసింది. మోదీ పాలనను 'దౌర్జన్యం, గందరగోళం, అరాచకం'గా అభివర్ణించింది. మోదీ ప్రభుత్వ అజ్ఞానంతో దేశం ఆర్థిక మాంద్యం వైపు వెళుతోందని ఆరోపించింది.

'మోదీ 2.0: వంద రోజుల దౌర్జన్యం, గందరగోళం, అరాచకం'

అహంకారం, అనిశ్చితి, కక్షసాధింపు రాజకీయాలే ప్రధానాంశాలుగా మోదీ 2.0 ప్రభుత్వ 100 రోజుల పాలన సాగిందని ధ్వజమెత్తింది కాంగ్రెస్. దేశ ఆర్థిక స్థితిగతులు, కశ్మీర్​ పరిస్థితి, అసోం ఎన్​ఆర్​సీ, విపక్ష నేతలపై దర్యాప్తు సంస్థల చర్యలను ప్రస్తావిస్తూ కేంద్రంపై తీవ్ర విమర్శలు గుప్పించింది. '100 డేస్​ నో వికాస్​' (అభివృద్ధి లేని 100 రోజులు) హ్యాష్​ టాగ్​తో భాజపాను విమర్శిస్తూ వరుస ట్వీట్లు చేసింది కాంగ్రెస్.

"భాజపా 2.0 వంద రోజుల పాలనను మూడు పదాల్లో వర్ణించవచ్చు. అవి దౌర్జన్యం, గందరగోళం, అరాచకం."
- కాంగ్రెస్ పార్టీ ట్వీట్​

'అజ్ఞానంతో మాంద్యం'

మోదీ సర్కార్​ అజ్ఞానం, ఆర్థిక వ్యవస్థ స్థూల నిర్వహణ లోపాల వల్లే దేశ ప్రగతి రథం నెమ్మదించిందని విమర్శించింది కాంగ్రెస్.

"దేశంలోని 8 కీలక రంగాలు 2 శాతం కంటే తక్కువ వృద్ధిరేటు నమోదు చేస్తున్నాయి. అర్థిక వృద్ధి పతనమవుతోంది. అయినప్పటికీ ఈ విషయాన్ని అంగీకరించేందుకు ఆర్థికమంత్రి నిరాకరిస్తున్నారు. భాజపా ఇలానే నిర్లక్ష్యంగా, మోసపూరిత మార్గాన్ని కొనసాగిస్తే దేశం ఆర్థిక మాంద్యంలోకి వెళ్లకతప్పదు."
- కాంగ్రెస్ పార్టీ ట్వీట్​

భాజపా మార్కు రాజకీయాలు 101

చిదంబరం, డీకే శివకుమార్​ వంటి సీనియర్​ నేతల అరెస్టులను పరోక్షంగా ప్రస్తావిస్తూ కేంద్రంపై విమర్శల దాడి చేసింది కాంగ్రెస్.

"మిగతావన్నీ విఫలమైనప్పుడు బలమైన విపక్ష నాయకులను అరెస్టు చేయండి. అప్పుడు మీరు ప్రతిరంగంలోనూ విఫలమయ్యారని ప్రజలు గమనించకుండా ఉంటారని ఆశిస్తున్నాం."
- కాంగ్రెస్ పార్టీ ట్వీట్​

పార్లమెంట్​ అంటే నోటీసు బోర్డ్​

భాజపా పార్లమెంట్​ను నోటీసు బోర్డులా చూస్తోందని కాంగ్రెస్ విమర్శించింది. కీలకమైన బిల్లులను ఎలాంటి చర్చ లేకుండానే సంఖ్యా బలంతో ఆమోదిస్తోందని ఆరోపించింది. ఇది బలహీనపడుతున్న ప్రజాస్వామ్యానికి సంకేతమని ఆవేదన వ్యక్తంచేసింది.

ఇదీ చూడండి: అభివృద్ధికి మారుపేరు మోదీ 2.0: అమిత్​షా

Last Updated : Sep 29, 2019, 9:33 PM IST

ABOUT THE AUTHOR

...view details