కర్ణాటకలో మోదీనే కీలకాంశం... ''భాజపా సొంత బలంతోనే దేశంలో 300 సీట్ల కంటే అధికంగా గెలుస్తుంది. కర్ణాటకలో 22 స్థానాలకు మించి గెలుస్తుంది. ఇది కచ్చితం. ప్రజలనాడి అలానే ఉంది. ఎక్కడికెళ్లినా భాజపానే తిరిగి అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. అదీ సొంత బలంతోనేనని భావిస్తున్నారు. భాజపా ఎక్కువ సీట్లు సాధించాలని ఆశిస్తున్నామంతే. కానీ... ఎన్డీఏ దేశాన్ని పాలిస్తుంది.'' - సదానంద గౌడ, కేంద్ర మంత్రి
"భాజపాకు 300 స్థానాలు".... ఇటీవల బాగా వినిపిస్తున్న మాట. 2014లో భాజపాకు వచ్చిన సీట్లు 282. ఈ ఎన్నికల్లో అంతకన్నా ఎక్కువ సీట్లు వస్తాయన్న కమలనాథుల ధీమా వెనుక కారణం ఏంటి? అధికార పార్టీ ప్రచారాస్త్రం ఏంటి? సమాధానం ఒకటే... మోదీ. విపక్షాల ప్రధాన విమర్శనాస్త్రమూ మోదీనే కావడం మరో విశేషం.
ఇవీచూడండి:
భారత్ భేరి: ఓటేస్తే సగం ధరకే ఆలూ బోండా
ఛాయ్‌వాలా గెలిచాడు.. చౌకీదార్ సంగతేంటి...?
దక్షిణాదిన భాజపా కాస్త మెరుగైన స్థితిలో ఉంది కర్ణాటకలోనే. ఇటీవల శాసనసభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించిన పార్టీగా నిలిచినా... ఎన్నికల అనంతర పొత్తుల ఆటలో వెనుకబడింది. ప్రతిపక్షానికే పరిమితమైంది. ఇప్పుడు మరోమారు సత్తా చాటేందుకు భాజపాకు అవకాశం వచ్చింది. అందుకే మోదీ మంత్రమే ప్రధానాంశంగా ప్రచార క్షేత్రంలోకి దిగింది.
"కర్ణాటకలో మోదీ కీలకాంశం అనేందుకు ఎన్నో ఆధారాలు ఉన్నాయి. గత శాసనసభ ఎన్నికల్లో మోదీ బహిరంగ సభల్లో పాల్గొనడం ప్రారంభించాక భాజపా ఎంతో పుంజుకుంది. అంతకుముందు ఆ పార్టీ పరిస్థితి ఎంతో సంక్లిష్టంగా ఉంది."
-- హరీశ్ రామస్వామి, రాజకీయ విశ్లేషకుడు
10 మందిలో ఆరుగురు జైకొట్టారు!
''2014 ఎన్నికల్లో మోదీ ప్రభావం మిగతా రాష్ట్రాలతో పోల్చితే కర్ణాటకలోనే అధికం. ప్రతి 10 మంది ఓటర్లలో ఆరుగురు మోదీకే ఓటేశారు. దేశవ్యాప్తంగా ఈ సంఖ్య 3గా ఉంది. మోదీ ప్రభావం ఈ లోక్‌సభ ఎన్నికల్లోనూ నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుంది.''
-- సందీప్ శాస్త్రి, రాజకీయ విశ్లేషకుడు
కర్ణాటకలో మొత్తం 28 లోక్‌సభ నియోజకవర్గాలు. 2014లో 17 సీట్లు దక్కించుకుంది భాజపా. ఈసారి కమలదళం లక్ష్యం 22.
కర్ణాటకలో భాజపాకు మోదీయే బలం. అయినా... ఈసారి కమలదళం లక్ష్యం నెరవేరదని రాజకీయ విశ్లేషకుల అంచనా. 2014లో వచ్చినన్ని స్థానాలూ రాకపోవచ్చన్నది వారి అనుమానం.
"కర్ణాటకలో ఈసారి భాజపా అనుకున్నన్ని సీట్లు సాధించకపోవచ్చు. అందుకు కారణం యడ్యూరప్ప నాయకత్వం, ఆయన చేస్తున్న రాజకీయ తప్పిదాలే. బాలాకోట్ ఉగ్రస్థావరాలపై దాడితో భాజపా 22 సీట్లు గెలుస్తుందన్న యడ్యూరప్ప వ్యాఖ్యలు పార్టీని ఇబ్బందులకు గురిచేశాయి. జేడీఎస్-కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు చేసిన ప్రయత్నం విఫలం కావడం యడ్యూరప్ప ప్రాబల్యాన్ని తగ్గించింది."
-- హరీశ్ రామస్వామి, రాజకీయ విశ్లేషకుడు
భాజపా అగ్రనేతలకు ముడుపులు ఇచ్చానని యడ్యూరప్ప రాసిందిగా చెబుతున్న డైరీపై దుమారం... భాజపా విజయావకాశాలపై ప్రభావం చూపే అవకాశముంది.
శత్రువు బలహీనత మరో అస్త్రం...
''మోదీ అంశాన్ని పక్కనపెడితే... కాంగ్రెస్- జేడీఎస్ కూటమి కూడా ఎన్నికల్లో క్రియాశీల పాత్ర పోషిస్తుంది. కానీ... ఈ పొత్తుకు.. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు ఆమోదయోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే. ముఖ్యంగా మైసూరు ప్రాంతంలో కాంగ్రెస్- జేడీఎస్‌ల మధ్య రెండు దశాబ్దాలుగా విభేదాలున్నాయి. మండ్య స్థానంలో పోటీపై ఇరుపార్టీల మధ్య ప్రతిష్టంభన ఇందుకు ఓ చక్కటి ఉదాహరణ.''
-- సందీప్ శాస్త్రి, రాజకీయ విశ్లేషకుడు
జేడీఎస్-కాంగ్రెస్ మధ్య అంతరాల్ని భాజపా ఏమేరకు సొమ్ము చేసుకోగలదు అన్నది ఆసక్తికరం.
ఇవీ చూడండి:
భారత్ భేరి: 'నరేంద్రుడికి సాటి ఎవరు?'
భారత్ భేరి: 5% ఓట్లు ఫేస్బుక్, ట్విట్టర్వే!