ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై మరోమారు విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. శక్తిమంతమైన నాయకుడిగా మోదీ తనను తాను చిత్రీకరించుకోవటమే.. భారత్కు అతిపెద్ద బలహీనతగా మారిందని విమర్శించారు. చైనా.. భారత భూభాగాన్ని ఆక్రమించిందని పునరుద్ఘాటించారు. అధికారంలోకి వచ్చేందుకు శక్తిమంతమైన నేతగా చిత్రీకరించుకున్న మోదీ.. తన 56 అంగుళాల ఛాతీ సిద్ధాంతాన్ని కాపాడుకోవాలంటూ చురకలంటించారు.
చైనా వ్యూహాత్మక ప్రణాళిక పేరిట ట్విట్టర్‌లో ఓ వీడియో పోస్టు చేశారు రాహుల్. సరిహద్దు సమస్య ఒక్కటే చైనా వ్యూహం కాదని అభిప్రాయపడ్డారు.
"ఇప్పటికీ చైనా భారత భూభాగంలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఎలాంటి వ్యూహాత్మక ప్రణాళిక లేకుండా చైనీయులు ఏమీ చేయరు. ప్రపంచ ఆకృతిని మార్చాలనే లక్ష్యంగా చైనా దూకుడుగా ప్రవర్తిస్తోంది. అందుకు గ్వాదర్ నౌకాశ్రయం, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ నిర్మాణాలే ఉదాహరణ.