గుజరాత్లో 2002 నాటి అల్లర్ల విషయంలో ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ.. సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణ ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఆ సందర్భంలో 9 గంటల పాటు ఆయన్ను సిట్ ప్రశ్నించింది. అంతసేపు కనీసం టీ కూడా తీసుకోలేదు. ఏకధాటిగా అడిగిన వంద ప్రశ్నల్లో అన్నింటికీ సమాధానమిచ్చారు. ఈ విషయాలను అప్పటి సిట్ అధిపతిగా ఉన్న ఆర్.కె. రాఘవన్ తాజాగా రాసిన తన ఆత్మకథ 'ఎ రోడ్ వెల్ ట్రావెల్డ్'లో వెల్లడించారు.
9 గంటల విచారణలో టీ కూడా తీసుకోని మోదీ
గుజరాత్ అల్లర్ల కేసులో అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీని దర్యాప్తు చేసిన 9 గంటల పాటు కనీసం టీ కూడా తీసుకోలేదని అప్పటి సిట్ అధిపతి ఆర్కె రాఘవన్ వెల్లడించారు. ఆయనకు సంధించిన కఠినమైన వంద ప్రశ్నలకు ఏకధాటిగా సమాధానం చెప్పారని తెలిపారు. మోదీ నిగ్రహ శక్తి గొప్పదని తన ఆత్మకథలో వివరించారు.
"అడిగిన వెంటనే గాంధీనగర్లోని సిట్ కార్యాలయానికి మోదీ వచ్చారు. ఓ నీళ్ల సీసాను వెంట తెచ్చుకున్నారు. మధ్యలో టీ, భోజనం కోసం విరామం తీసుకోమని కోరినా తిరస్కరించారు. కఠినమైన వంద ప్రశ్నల్ని ఆయనకు సంధించాం. అన్నింటికీ స్పష్టంగా సమాధానాలిచ్చారు. ఆయన్ని విరామానికి ఒప్పించడమే మాకు కష్టంగా మారింది. ప్రశ్నలు అడుగుతున్న వారినే కాస్త విశ్రాంతి తీసుకోమనేలా మోదీ వ్యవహరించారు. ఆయన నిగ్రహ శక్తి గొప్పది." అని పుస్తకంలో వివరించారు.
ప్రాసిక్యూట్ చేయడానికి తగిన సాక్ష్యం లేదంటూ మోదీకి 2012లో సిట్ క్లీన్చిట్ ఇచ్చింది. ముఖ్యమంత్రికి అనుకూలంగా వ్యవహరించానంటూ తనపైనా పలు పిటిషన్లు దాఖలయ్యాయని, కానీ తప్పు చేసినట్టు ఎక్కడా వెల్లడి కాలేదని రాఘవన్ చెప్పుకొచ్చారు. ఆనాడు దిల్లీ వ్యవహారాల్లో కీలకంగా ఉన్న వ్యక్తులే మోదీని లక్ష్యంగా చేసుకున్నారన్న రాఘవన్ ఆ వ్యక్తులు ఎవరన్నది వెల్లడించలేదు.