కేంద్రంలో మరోసారి సంపూర్ణ మెజార్టీతో భాజపా ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందని ప్రధాని నరేంద్రమోదీ ధీమా వ్యక్తం చేశారు. 2014 కంటే అత్యధిక మెజారిటీ సాధించి దిల్లీలో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. 30 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఏర్పడిన సుస్థిర ప్రభుత్వంపై దేశ ప్రజ్లలో సంపూర్ణ విశ్వాసం కనబడుతోందని.. ఆ నమ్మకాన్ని మరోసారి నిలబెట్టుకుంటామన్నారు. విభజన హామీల పరిష్కారం కోసమే తెలుగురాష్ట్రాల గవర్నర్ను కొనసాగిస్తున్నామని చెప్పారు. పోలవరానికి పూర్తి నిధులు ఇస్తామని చెప్పిన ఆయన.. కాళేశ్వరం జాతీయ హోదాపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటామన్నారు. సార్వత్రిక ఎన్నికల వేళ ప్రధాని మోదీ.. ఈనాడు సీనియర్ అసోసియేట్ ఎడిటర్ ఎం.నాగేశ్వరరావు, ప్రిన్సిపల్ కరస్పాండెంట్ విజయభాస్కర్, స్పెషల్ కరస్పాండెంట్ రాజీవ్ రాజన్లకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
దేశం విశ్వాసం పొందాం...
ఐదేళ్ల పాలనతో 125కోట్ల మంది దేశ ప్రజల విశ్వాసాన్ని పొందామని ప్రధాని నరేంద్రమోదీ ఉద్ఘాటించారు. 2014 కంటే ఎక్కువ స్థానాలు సాధిస్తామన్నారు. ఈ ఐదేళ్లలో సుస్థిర ప్రభుత్వంతో ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో సామాన్య ప్రజలు కూడా గుర్తించారని.. బలమైన ప్రభుత్వం రావాలనే ఆకాంక్ష వారిలో ఉందని చెప్పారు.
సంపూర్ణ మెజారిటీ సాధించినా.. అన్నీ పార్టీలను కలుపుకుని వెళ్లిన తమ విధానాలను ప్రజలు స్వాగతించారని... ఈ స్పూర్తి నచ్చే ప్రజలంతా తమకు మద్దతిస్తారని మోదీ అభిప్రాయం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వ పనితీరుపై ప్రజలకు విశ్వాసం వచ్చిందన్నారు. మన్మోహన్‌సింగ్ హయాంలో పాలకుల నోటినుంచి కేవలం ‘జాతీయ ఉపాధి హామీ పథకం తప్ప మరో మాటే వినిపించేది కాదని..తాము దేశ సమస్యలకు కొత్త తరహా పరిష్కార మార్గాలు చూపుతున్నామన్నారు. సంస్కరించు...(రిఫామ్) పనితీరు కనబరుచు...(పెర్ఫామ్) మార్పు చూపించు (ట్రాన్స్‌ఫామ్) అనే మూలసూత్రంతో ముందడుగు వేస్తున్నామన్నారు. 2014కు ముందు దేశవ్యాప్తంగా అలముకున్న నిరాశా నిస్పృహలను పారద్రోలామని.. ఇప్పుడు దేశంలో ఏ మారుమూల గ్రామానికి వెళ్లినా ఆత్మవిశ్వాసం కనిపిస్తోందని ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు.
మహాకూటమితో ఏమీకాదు..