ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు 69వ వసంతంలోకి అడుగుపెట్టారు. జన్మదినం సందర్భంగా సొంత రాష్ట్రం గుజరాత్లో పర్యటించనున్నారు ప్రధాని. సోమవారం రాత్రే గుజరాత్ చేరుకున్న ఆయన.. గుజరాతీలకు జీవనాధారంగా పిలుచుకునే 'సర్దార్ సరోవర్ జలాశయాన్ని' ఇవాళ సందర్శిస్తారు. అనంతరం 'నమామి దేవి నర్మదా' ఉత్సవాన్ని ప్రారంభించి.. నర్మదా జిల్లా కేవడియా గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు.
ఇదే మొదటిసారి
2017లో జలాశయ సామర్థ్యం పెంచిన తర్వాత మొదటిసారిగా పూర్తిస్థాయిలో నిండింది సర్దార్ డ్యామ్. ఈ నేపథ్యంలో 'నమామి దేవి నర్మదా' మహోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. గుజరాతీ చలనచిత్ర పరిశ్రమ నుంచి నటులు, గాయకులు రాష్ట్రవ్యాప్తంగా జరగనున్న ఉత్సవాల్లో పాల్గొననున్నారు. మరోవైపు ప్రధానమంత్రి జన్మదిన వేడుకలను దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున జరిపేందుకు భాజపా నేతలు, కార్యకర్తలు ఏర్పాట్లు సిద్ధం చేశారు.