ఝార్ఖండ్‌లో మోదీ ఎన్నికల ప్రచారం కాంగ్రెస్-జేఎమ్ఎమ్ కూటమి మోసపూరిత రాజకీయాలను అనుసరిస్తోందని ఆరోపించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. భాజపా మాత్రం ప్రజాసేవకే అంకితమని స్పష్టం చేశారు. ఝార్ఖండ్‌లోని కుంతిలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని.. కమల దళంపై రాష్ట్రప్రజలకు విశ్వాసం ఉందన్నారు.
ఆదివాసీలు అధికంగా ఉండే కుంతి ప్రాంతంలో అయోధ్య రామమందిర అంశాన్ని ప్రస్తావించారు మోదీ. ఆదివాసీల వల్లే అయోధ్యలోని ఓ సాధారణ రాజకుమారుడు.. 14 ఏళ్ల వనవాసం తర్వాత దేవుడయ్యాడని పేర్కొన్నారు.
"ఒక రాజకుమారుడు అయోధ్య నుంచి బయలుదేరతాడు. 14 ఏళ్లు అడవిలో ఉంటాడు. వెనక్కి తిరిగివచ్చాక అదే రాజకుమారుడు.. పురుషోత్తముడు.. భగవంతుడు.. రాముడు అవుతాడు. ఎందుకంటే.. ఆ 14 ఏళ్ల పాటు రాజకుమారుడు రాముడు.. ఆదివాసీల మధ్య జీవించాడు. రాముడిని వారు ఎంతో గౌరవించారు. అలాంటిది ఆదివాసీల హృదయం. రామమందిరం సహా ఎన్నో ఏళ్లుగా నలిగిపోతున్న సమస్యలను రాజకీయ లబ్ధి కోసం పరిష్కరించకుండా వదిలేశారు కొంతమంది. దేశ శ్రేయస్సు, శాంతి, ఐకమత్యం కోసం మేము ఆ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాం. మంచి ఫలితాలతో ముందుకు సాగుతున్నాం."
--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
రాష్ట్రంలో నక్సలైట్ల ఉనికి చాలా వరకు తగ్గిందని.. అది భాజపా వల్లే సాధ్యపడిందని స్పష్టం చేశారు ప్రధాని.
ఇదీ చూడండి:- ఇస్రో, నాసాకు అసాధ్యం... ఆ చెన్నై ఇంజినీర్‌కు సుసాధ్యం!