కాంగ్రెస్ పార్టీ మధ్యతరగతి వ్యతిరేకి అన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో మధ్యతరగతి వారిని విస్మరించిందని త్రిపురలోని ఉదయ్‌పుర్ వేదికగా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, వామపక్ష పార్టీలు తనను అధికారంలో నుంచి దించేందుకు ఎంతకైనా దిగజారుతాయన్నారు.
వామపక్ష పార్టీల నిబంధనావళి దేశ రాజ్యాంగం కంటే పెద్దదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వామపక్షాలకు దేశానికి దిశానిర్దేశం చేసే ఆసక్తి లేదని, వారి సొంత పరిస్థితిని మెరుగుపరుచుకోవడమే వారికి అవసరమైపోయిందన్నారు.
మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ త్రిపురలో పాగా వేసేందుకు ప్రయత్నించిందని, కానీ ప్రజలు వారిని తిప్పికొట్టారన్నారు.
'నన్ను గద్దె దించేందుకు ఎంతకైనా దిగజారుతారు' "మధ్యతరగతి వారిని వ్యతిరేకించే వారితో జాగ్రత్త. మీరు ఇబ్బంది పడతారు. కాంగ్రెస్ పార్టీ ఇటీవల మేనిఫెస్టోను విడుదల చేసింది. 50-60 పేజీల మేనిఫెస్టోలో ఒక్కసారీ మధ్యతరగతి అన్న పదమే లేదు. దేశానికి దిశ చూపిస్తామని వామపక్ష నేతలు మాట్లాడతారు. వామపక్షం అధికారంలో ఉంటే రాజకీయ హింస, బదులు తీర్చుకోవడమనే అంశాలు ప్రాధాన్యంగా ఉంటాయి. కాంగ్రెస్, వామపక్షాల ఉద్దేశాలన్నీ స్వార్థపూరితమే."-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి