ఎన్నికల వేళ కాంగ్రెస్ ప్రచారాలపై ప్రధాని నరేంద్రమోదీ మండిపడ్డారు. ఎన్డీఏ ప్రభుత్వం చేసిన పనులపై అసత్యాలు ప్రచారం చేసి పబ్బం గడుపుతోందని విమర్శించారు. హరియాణా రోహతక్‌లో ఏఎన్ఐ వార్తాసంస్థకు ఇచ్చిన ముఖాముఖిలో కాంగ్రెస్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు మోదీ.
వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే భాజపా దేశ భద్రత, జాతీయవాదాన్ని ప్రచారాస్త్రాలుగా ఎంచుకుందన్న ఆరోపణలను తోసిపుచ్చారు మోదీ.
నరేంద్రమోదీ, ప్రధానమంత్రి
"మొదటి నుంచి చెబుతున్నా... మేము కోటిన్నర మందికి ఇళ్లు కట్టించాం. కోటి ఇళ్లే ఇచ్చానని కాంగ్రెస్ సవాల్ చేయగలదా? 18 వేల గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించాం. అలా జరగలేదని మాట్లాడగలదా? ఆయుష్మాన్ భారత్ పథకంతో పేదలకు రూ. 5 లక్షల ఆరోగ్య బీమా కల్పించాం. కాదని సవాల్ విసరమనండి. రైతులకు మద్దతు ధర పెంచాం. ఒకటిన్నర రెట్లు పెరిగింది. గత ప్రభుత్వంతో పోలిస్తే రెండు రెట్లు రహదారుల నిర్మాణం అత్యంత వేగంగా చేశాం. రైల్వే వ్యవస్థలో వేగంగా అభివృద్ధి పనులు చేశాం. ఈ అంశాలపై కాంగ్రెస్ మాట్లాడుతుందా? అసత్యాలు మాత్రం చెబుతుంది. జరిగిన అభివృద్ధిపై కాంగ్రెస్ మాట్లాడదు. ఎందుకంటే ఆ అంశంతో ఎన్నికల్లోకి వెళ్లే ధైర్యం వాళ్లు చేయలేరు. ఆ కారణంతోనే అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. వాటికి ఆధారాలు అవసరం లేదు కదా. మేం చేసిన అభివృద్ధిని ప్రజలకు చెప్పే హక్కు మాకుంది."
-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
ఇదీ చూడండి: బాబు, కేసీఆర్‌పై మోదీ 'యూటర్న్ పంచ్'