దేశవ్యాప్తంగా నేడు నిర్వహించిన జనతా కర్ఫ్యూకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. కరోనా వైరస్ను లెక్కచేయక ప్రజల కోసం పని చేసే వారి కోసం దేశమంతా ఒక్కటై చప్పట్లతో సంఘీభావం తెలిపింది. స్వచ్ఛంద కర్ఫ్యూలో భాగంగా సాయంత్రం 5 గంటల తర్వాత వారి వారి ఇళ్ల బాల్కనీలు, మిద్దెలపై నుంచి, మరికొందరు బయటికొచ్చి చప్పట్లు కొట్టారు.
కరోనా ప్రభావం పెరుగుతున్న తరుణంలో తమకు వైరస్ సోకే అవకాశాలు ఉన్నప్పటికీ వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, మీడియా రంగ ప్రతినిధులు, పోలీసులు, డ్రైవర్లు, రైల్వే, బస్సు, ఆటో రిక్షా కార్మికులు, డెలివరీ బాయ్స్ వీరందరూ దేశ ప్రజలకోసం శ్రమిస్తున్నారు. వారి కృషికి కృతజ్ఞతగా చప్పట్లతో సంఘీభావం తెలిపింది యావత్ ప్రజానీకం.