తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'లోహియా సిద్ధాంతాలు పాటించరు కానీ ఆదర్శమంటారు'

ప్రాంతీయ పార్టీలపై విమర్శలు గుప్పించారు ప్రధాని నరేంద్ర మోదీ. రామ్​ మనోహర్​ లోహియా తమకు ఆదర్శమంటూ ప్రకటనలు చేస్తున్న ఆ పార్టీలు... ఆయన సిద్ధాంతాలు ఒక్కటీ పాటించడం లేదని విమర్శించారు.

లోహియా

By

Published : Mar 23, 2019, 4:59 PM IST

కాంగ్రెస్​తో చేతులు కలిపి ప్రాంతీయ పార్టీలు సరిదిద్దుకోలేని తప్పు చేశాయని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. దాదాపు అన్ని ప్రాంతీయ పార్టీలు రామ్​మనోహర్​ లోహియా తమకు ఆదర్శం అని చెప్పుకుంటాయని, ఆయన సిద్ధాంతాలు ఒక్కటీ పాటించవని ఎద్దేవా చేశారు.

రామ్​ మనోహర్​ లోహియా 109వ జయంతిని పురస్కరించుకుని నేడు మోదీ తన బ్లాగులో సందేశమిచ్చారు.

"చాలా పార్టీలు రామ్​ మనోహర్​ లోహియా సిద్ధాంతాలు తమకు ఆదర్శమని చెబుతుంటాయి. కానీ అదంతా అబద్ధం. రాజకీయ అవసరాల కోసం కాంగ్రెస్​తో మహాకూటములు, మిలావత్​లు ఏర్పరుచుకుంటున్నాయి." - నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

సమాజ్​వాదీ పార్టీ, జనతాదళ్​(ఎస్​), శరద్​యాదవ్​ నేతృత్వంలోని లోక్​ తాంత్రిక్​​ జనతాదళ్​... లోక్​సభ ఎన్నికల అనంతరం ఆర్జేడీలో కలుస్తాయని జోస్యం చెప్పారు. ఈ పార్టీలు తమని తాము సామ్యవాద పార్టీలుగా అభివర్ణించుకుంటున్నాయని విమర్శించారు మోదీ.

మనోహర్​ లోహియా సిద్ధాంతాలను అనుసరిస్తున్న ఏకైక కూటమి ఎన్డీయేదేనని, ఈ సమయంలో ఆయన ఉండి ఉంటే గర్వపడేవారని మోదీ అన్నారు.

వ్యవసాయంలో ఆధునిక పద్ధతుల ప్రవేశం, రైతులకు చేయూతనిచ్చే పీఎం-కిసాన్​ సమ్మాన్​ నిధి, కృషి సంచాయ్​ యోజన, ఈ-నామ్​, ఆరోగ్య కార్డులు లాంటి పథకాలు ప్రవేశ పెట్టడానికి మనోహార్​ లోహియానే తమకు ఆదర్శమని మోదీ ట్విటర్​లో పేర్కొన్నారు.

లింగ సమానత్వం కోసం లోహియా పోరాడారని మోదీ గుర్తు చేశారు. కాంగ్రెస్​ హాయంలో వ్యవసాయం, పరిశ్రమలు, రక్షణ రంగం ఏ మాత్రం అభివృద్ధి చెందలేదని లోహియా వ్యాఖ్యానించిన విషయాన్ని గుర్తుచేశారు మోదీ. వారసత్వ పాలనకు రామ్​ మనోహర్​ లోహియా వ్యతిరేకమని మోదీ గుర్తు చేశారు.

అధికారం కోసం తీవ్రంగా ప్రయత్నించడం, అధికారం దక్కాక బడుగు, బలహీన వర్గాలను దోచుకోవటమే కొన్ని పార్టీల ప్రధాన లక్ష్యమని మోదీ ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details