తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నమో 2.0: దౌత్యపరంగా సూపర్​ హిట్​ - అశోక్​ సజ్జనార్

49 పర్యటనలు.... 93 దేశాలు... తొలి దఫా అధికారంలో ఉన్న సమయంలో నరేంద్రమోదీ చేసిన విదేశీ పర్యటనల వివరాలివి. దౌత్యపరంగా ఆ స్థాయిలో ముద్రవేశారు మోదీ. మరి ఇప్పటి సంగతేంటి? మోదీ 2.0 ప్రభుత్వ విదేశాంగ విధానం ఎలా ఉంది?

నమో 2.0: దౌత్యపరంగా అదే దూకుడు

By

Published : Sep 6, 2019, 9:56 AM IST

Updated : Sep 29, 2019, 3:08 PM IST

నమో 2.0: దౌత్యపరంగా అదే దూకుడు
విదేశాంగ విధానం... ఉగ్రవాదం, నక్సలిజం, తీవ్రవాదం, పొరుగుదేశాలతో వివాదాలు వంటివి పరిష్కరించడంలో ఎంతో కీలకం. దేశం ప్రగతి పథంలో పయనించాలన్నా విదేశాంగ విధానం బలంగా, స్పష్టంగా ఉండాలి. 2014లో తొలిసారి అధికారి పగ్గాలు చేపట్టిన మోదీ ప్రభుత్వానికి ఇది బాగా తెలుసు. విదేశాంగ విధానంలో మోదీ అవలంబించిన తీరుపైనా ప్రశంసలొచ్చాయి. ఇది ఆయనను అంతర్జాతీయ సమాజంలో బలమైన నేతగా నిలబెట్టాయి కూడా. రెండో దఫా పాలనలోనూ అదే జోరు కొనసాగిస్తున్నారు మోదీ.

''విదేశాంగ విధానంపై నిజానికి మోదీ ప్రభుత్వం చాలా తక్కువ సమయంలోనే గొప్ప ఘనత సాధించింది. మోదీ రెండోసారి తిరిగి ఎన్నికైన తర్వాత.. మాల్దీవులు, భూటాన్​ వెళ్లారు. అనంతరం విదేశాంగ మంత్రి అదే పని చేశారు. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు భారత్​ పొరుగుదేశాలకు ఇచ్చే ప్రాధాన్యమేంటో.
మోదీ ప్రభుత్వం తీసుకున్న అతిపెద్ద నిర్ణయం అధికరణ 370 రద్దు. ఈ అంశాన్ని పాకిస్థాన్​ అంతర్జాతీయ సమస్యగా చూపే ప్రయత్నం చేసింది. కానీ.. కశ్మీర్​ అంశం పూర్తిగా తమ అంతర్గతమని నొక్కిచెప్పింది భారత్​. ఈ విషయంలో మోదీ, ఎన్డీఏ ప్రభుత్వం ప్రపంచ సమాజం మద్దతు పొందగలిగింది.''
-అనిల్​ త్రిగునాయత్,​ భారత మాజీ రాయబారి

100 రోజుల్లోనే మాల్దీవులు, శ్రీలంక, భూటాన్​, ఫ్రాన్స్​, బహ్రెయిన్​, యూఏఈ, రష్యా దేశాల్లో పర్యటించారు మోదీ. బిమ్​స్టెక్​ దేశాల సదస్సులో పాల్గొన్నారు. ఆయా దేశాలతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఫ్రాన్స్​ బియరెజ్​ వేదికగా జీ-7 సదస్సులో పాల్గొన్నారు. రష్యాలో తూర్పు దేశాల ఆర్థిక సదస్సుకు హాజరయ్యారు. అక్కడ మంగోలియా, జపాన్​, మలేసియా దేశాధినేతలతో సమావేశమయ్యారు.

అమెరికా, రష్యా, చైనా, జపాన్​, యూఏఈ.. ఇలా ఏ దేశమెళ్లినా అక్కడి నాయకుల్ని ఆకట్టుకోవడంలో మోదీ ప్రత్యేకతే వేరు. అందుకే ఆయా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలు అంత బలంగా ఉన్నాయి.

''మోదీ విదేశాంగ విధానం... బలమైన, ధైర్యవంతమైన, సాహసోపేతమైన, నమ్మకంతో కూడుకున్నది. మీరొకసారి ఇతర దేశాలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి విధానాలు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పర్యటనలు చూస్తే... అంతర్జాతీయ సమాజంలో భారత్​ ఒక బలీయమైన శక్తిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తోందని తెలుస్తోంది.''
- అశోక్​ సజ్జనార్​, మాజీ రాయబారి

అవార్డులు...

మోదీ విదేశాంగ విధానంతో అవార్డులూ ఆయన దరిచేరాయి. ఏ దేశానికెళితే అక్కడి విశిష్ట పురస్కారంతో సత్కరించాయి పలు దేశాలు.

  • బహ్రెయిన్​లో తొలిసారి పర్యటించిన భారత ప్రధాని నరేంద్ర మోదీకి బహ్రెయిన్​ విశిష్ట పురస్కారం లభించింది. 'ద కింగ్​ హమాద్​ ఆర్డర్​ ఆఫ్​ రెనాయిసన్స్​'తో ఆ దేశం గౌరవించింది.
  • రష్యా అత్యున్నత పురస్కారం 'ఆర్డర్​ ఆఫ్​ సెయింట్​ ఆండ్రూ ద అపోజిల్​'ను మోదీకి ప్రకటించింది.
  • మాల్దీవులు ప్రభుత్వం మోదీని 'నిషానిజుద్దీన్​' అవార్డుతో సత్కరించింది.
  • యూఏఈ అత్యున్నత పౌర పురస్కారమైన 'ఆర్డర్ ఆఫ్ జాయేద్‌'ను స్వీకరించారు ప్రధాని నరేంద్ర మోదీ.
  • రష్యా అధ్యక్షుడు పుతిన్‌, క్వీన్ ఎలిజబెత్‌-2, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ సహా మరికొందరు ప్రపంచనేతలకు మాత్రమే ఈ అవార్డును ప్రదానం చేశారు.

అంతర్జాతీయంగా మోదీ ప్రభుత్వం విజయాలు...

జమ్ముకశ్మీర్​ అంశంలో...

జమ్ముకశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేయడం సహా రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది నరేంద్ర మోదీ ప్రభుత్వం. ఈ సంచలన నిర్ణయాన్ని సమర్థించుకున్న కేంద్రం... ప్రపంచ దేశాల జోక్యం లేకుండా చూసుకోగలిగింది. ఇందుకు పటిష్ఠమైన, పరస్పర స్నేహ పూర్వక విధానమే కారణం.

కశ్మీర్​ విభజనను దాయాది పాకిస్థాన్​ తీవ్రంగా వ్యతిరేకించింది. భారత్​తో దాదాపు అన్ని దౌత్య, వాణిజ్య సంబంధాలను రద్దు చేసుకుంది. ఈ అంశాన్ని పాకిస్థాన్​... అమెరికా, చైనా, ఐరాస సహా తమ ఇతర మిత్రదేశాల దృష్టికి తీసుకెళ్లినా భంగపాటే ఎదురైంది. ఇది భారత అంతర్గత విషయమని తేల్చిచెప్పాయి.

మధ్యలో ట్రంప్​ మధ్యవర్తిత్వం చేస్తానని ముందుకొచ్చినా... జీ-7 సదస్సు సమయంలో అమెరికా అధ్యక్షుడిని వెనక్కితగ్గేలా చేశారు మోదీ. ద్వైపాక్షిక చర్చలతోనే సమస్య పరిష్కారమవుతుందని ట్రంప్​తోనే చెప్పించారు భారత ప్రధాని.

మాల్దీవులు వేదికగా..

మాల్దీవులు వేదికగా జరిగిన స్పీకర్ల సదస్సులోనూ పాకిస్థాన్..​ కశ్మీర్​ అంశాన్ని లేవనెత్తింది. ఇక్కడా దాయాది దేశానికి చుక్కెదురైంది. ఈ సమస్యను ఆయా దేశాల ప్రతినిధులు మచ్చుకైనా పట్టించుకోలేదట. ఇదే సందర్భంలో కశ్మీర్​ తమ అంతర్గత సమస్య అని భారత్​ ప్రతిపాదించిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇందుకు కారణం లేకపోలేదు. అదే భారత విదేశాంగ విధానం. పాక్​ దుష్ట వైఖరిపై నిజమెరిగిన ఆయా దేశాలు ఈ అంశంలో దాయాది దేశం పక్షాన నిలవలేదు.

కులభూషణ్​ జాదవ్​..

పాక్​ చెరలో ఉన్న భారత నౌకాదళ మాజీ అధికారి కులభూషణ్​ జాదవ్​ కేసులోనూ అంతర్జాతీయంగా మోదీ ప్రభుత్వం విజయం సాధించింది. అంతర్జాతీయ న్యాయస్థానం.. భారత ప్రతినిధుల వాదనలు అంగీకరించి.. జాదవ్​ ఉరి శిక్షను నిలిపివేసింది. ఆయన శిక్షను పునఃసమీక్షించాలని పాక్​ను ఆదేశించింది. ఇటీవలే జాదవ్​కు దౌత్యసాయం అవకాశం కల్పించారు. భారత్​కు ఇది అతిపెద్ద విజయం.

ఇదీ చూడండి: మోదీ 2.0: నరేంద్రుడి సంచలనాల సెంచరీ

Last Updated : Sep 29, 2019, 3:08 PM IST

ABOUT THE AUTHOR

...view details