దేశంలో ఉల్లి ధరలు అదుపు చేసేందుకు చర్యలు ముమ్మరం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా టర్కీ నుంచి 11వేల టన్నుల ఉల్లిని దిగుమతి చేసుకునేందుకు ప్రభుత్వ రంగ సంస్థ మెటల్స్, మినర్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎంఎంటీసీ) సిద్ధమైంది. ఈ దిగుమతులు జనవరి నాటికి స్వదేశానికి చేరుకోనున్నట్లు సమాచారం.
విదేశాల నుంచి 1.2 లక్షల టన్నుల ఉల్లి దిగుమతి చేయడానికి కేంద్ర కేబినెట్ నిర్ణయించిన నేపథ్యంలో ఎంఎంటీసీ ఇది వరకే 6,090 టన్నుల ఉల్లిని ఈజిప్టు నుంచి దిగుమతి చేసుకుంది. మరో రెండు వారాల్లో స్వదేశానికి ఈ మొత్తం చేరనుంది.
విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఉల్లిని ప్రజలకు తక్కువ ధరకే విక్రయించడానికి ఆయా రాష్టాలప్రభుత్వాలకు కేటాయించనుంది కేంద్రం. ముంబయిలో రూ.52-55, దిల్లీలో రూ.60కి విక్రయించనున్నట్లు తెలుస్తోంది.
ఉల్లి ధరలను అదుపులోకి తేవడానికి ఆర్థిక మంత్రి, వినియోగదారు వ్యవహారాల మంత్రి, వ్యవసాయ మంత్రి, రవాణా శాఖలతో కూడిన కేంద్ర మంత్రివర్గం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. దీనికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వం వహిస్తున్నారు. విపణిలో ఉల్లి సరఫరా సహా ఇతర విషయాలపై వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వశాఖ కార్యదర్శి కె. శ్రీవాస్తవ ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు.