ప్రభుత్వ ఆసుపత్రులలో రోగుల దయనీయ పరిస్థితిని తెలిపే ఘటన మధ్యప్రదేశ్ విజయ్‌పుర్ జిల్లాలోని షియోపుర్‌లో జరిగింది. ఓ భాజపా ఎమ్మెల్యే కుమార్తె పురిటి నొప్పులు పడుతూ వైద్యుల కోసం దాదాపు 12 గంటలు వేచి చూడాల్సి వచ్చింది. అప్పటికీ వైద్యులు రానందు వల్ల చివరకు ఆమెను 119 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రైవేటు ఆస్పత్రికి తరలించాల్సి వచ్చింది.
ఏం జరిగింది...
విజయపుర్ ఎమ్మెల్యే సితారాం ఆదివాసి కుమార్తెను ప్రసవం కోసం జిల్లా ఆసుపత్రిలో సోమవారం చేర్చారు. సిజేరియన్ ఆపరేషన్ చేయాలని ఆస్పత్రి వర్గాలు సూచించాయి. కానీ అందుకు సంబంధించిన వైద్యుడు అందుబాటులో లేక.. తన కుమార్తె 12 గంటల పాటు పురిటి నొప్పులతో వేచి చూడాల్సి వచ్చిందని ఎమ్మెల్యే ఆరోపించారు.
"సమయానికి వైద్యులు అందుబాటులో లేరు. గర్భవతిని వేరే ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిన అంబులెన్సు కోసం రెండున్నర గంటల పాటు వేచి చూసినా ప్రయోజనం లేకుండా పోయింది. అనంతరం రాత్రి 10:30 గంటల ప్రాంతంలో ప్రైవేటు ఆస్పత్రికి తరలించాలని నిర్ణయించాం."
--- సీతారాం ఆదివాసీ, భాజపా ఎమ్మెల్యే.
119 కిలోమీటర్లు ప్రయాణించిన అనంతరం శివపురిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది ఎమ్మెల్యే కుమార్తె. ప్రసవం ఆలస్యంగా జరగటం వల్ల శిశువు పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ప్రస్తుతం వైద్యులు శిశువుకు ప్రత్యేక వైద్య సేవలు అందిస్తున్నట్టు వివరించారు.
జిల్లా ఆసుపత్రిలో సిజేరియన్ చేయాల్సిన వైద్యుడు.. ఓ ఆరోగ్యశాఖ క్యాంప్‌కు వెళ్లినట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
ఇదీ చూడండి:''మహా'లో స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం'