బిహార్ ఎన్నికల్లో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పాల్గొనకపోవడం తమకు లోటేనని ఆయన కుమారుడు, పార్టీ నేత తేజస్వీ యాదవ్ తెలిపారు. ఎన్నికల ప్రచారాల్లో పార్టీ కార్యకర్తల్లో స్ఫూర్తిని పెంచే సామర్థ్యం కచ్చితంగా కొరవడుతుందని అభిప్రాయపడ్డారు. ఎన్నికల ప్రచారం ప్రారంభించడానికి ముందు ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడారు తేజస్వీ.
"పార్టీ వ్యక్తులమే కాదు.. ప్రజలు కూడా లాలూను మిస్ అవుతున్నారు. ప్రజలు ఆయనపై ఉంచిన నమ్మకంతోనే గత ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించాం. ఆయన చూపించిన మార్గంలోనే మేం నడుస్తున్నాం. ఈ ఎన్నికలు బిహార్ ప్రజలకు ఎంత ప్రాధాన్యమైనవో ఆయన అర్థం చేసుకున్నారు. విజయం కోసం అందరూ కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు."
- తేజస్వీ యాదవ్, ఆర్జేడీ నేత
ఇదే తొలిసారి..
దాణా కుంభకోణానికి సంబంధించిన చైబాసా ట్రెజరీ కేసులో లాలూకు ఇటీవల ఝార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే మరో కేసు ఇంకా కోర్టులో ఉన్న నేపథ్యంలో లాలూ జైలులోనే ఉండాల్సి వచ్చింది. 30ఏళ్ల కాలంలో ఎన్నికల ప్రచారంలో లాలూ పాల్గొనకపోవటం ఇదే తొలిసారి.