2012 డిసెంబర్ 16.. దిల్లీ మునిరక బస్ స్టాండ్. ఓ 23ఏళ్ల యువతి.. తన స్నేహితుడితో కలిసి బస్సు కోసం ఎదురుచూస్తోంది. ఇంతలో పసుపు పచ్చ చారలున్న ఓ బస్సు అటువైపు వచ్చింది. బస్సులోని ఓ యువకుడు "ద్వారకా.. పాలమ్ మోడ్, ద్వారకా.. పాలమ్ మోడ్" అని అరుస్తూ ప్రయాణికుల కోసం ఎదురుచూస్తున్నాడు. కొద్ది సేపటి అనంతరం తన స్నేహితుడితో కలిసి యువతి ఆ బస్సు ఎక్కింది.
అప్పటి వరకు సంతోషంగా ఉన్న ఆ యువతికి.. ఆ రాత్రి కాళరాత్రిగా మిగిలిపోయింది. ఆ ఘటన యావత్ భారత దేశాన్నే కుదిపేసింది. బస్సులోని ఆరుగురు మృగాళ్లు.. ఆమె స్నేహితుడిని కట్టిపడేసి విచక్షణారహితంగా కొట్టారు. ఆ యువతిపై అతి కిరాతకంగా దాడి చేసి అత్యాచారానికి ఒడిగట్టారు. అది జరిగిన కొద్ది రోజులకు ఆ యువతి ప్రాణాలు కోల్పోయింది. కానీ ఆమె మాత్రం ప్రపంచానికి 'నిర్భయ'గా గుర్తుండిపోయింది.
బస్సే పట్టించింది...
ఈ ఘటన జరిగిన కొద్ది గంటలకే యావత్ భారత దేశం ఆగ్రహంతో రగిలిపోయింది. ఆ ఆరుగురిని పట్టుకోవడానికి దిల్లీ పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. వారి అన్వేషణలో ఆ బస్సే కీలక పాత్ర పోషించింది. బస్సు రంగు, ముందు భాగంలోని ఎడమ చక్రానికి హబ్క్యాప్ లేకపోవడం... దర్యాప్తులో కీలక ఆధారంగా మారింది.
17వ తేదీ వేకువజామునే దిల్లీ రవాణాశాఖ ఆధికారులను నిద్రలేపారు దిల్లీ పోలీసులు. రిజిస్టర్ అయి ఉన్న అన్ని తెల్ల బస్సుల వివరాలను తెలుసుకున్నారు. అలాంటివి 320 వాహనాలు ఉన్నట్లు గుర్తించారు.
మరో పోలీసు బృందం.. అదే సమయంలో జాతీయ రహదారిపై ఉన్న అన్ని హోటళ్లు, గెస్ట్ హౌస్ల సీసీటీవీ ఫుటేజ్ స్కాన్ చేసింది. హోటల్ 'దిల్లీ ఎయిర్పోర్ట్' వద్ద ఓ తెల్ల రంగు బస్సును పోలీసులు గుర్తించారు. దానిపై "యాదవ్" అనే పేరు పెయింట్ చేసి ఉంది. ఆ బస్సు దిల్లీ నుంచి గురుగ్రామ్ వైపు వెళుతూ కనిపించింది. 19 నిమిషాల తర్వాత.. తిరిగి అదే రూట్లో బస్సు వెళ్లడాన్ని పోలీసులు గమనించారు.