8 నెలలుగా తప్పిపోయిన ఓ జవాను సరిహద్దు ప్రాంతంలో మంచులో శవమై కనిపించాడు. ఈ ఏడాది జనవరిలో తప్పిపోయిన హవల్దార్ రాజేంద్రసింగ్ నేగి (36) మృతదేహాన్ని కశ్మీర్‌లోని ఎల్‌ఓసీ వద్ద శనివారం గుర్తించారు. 11వ గర్‌వాలీ రైఫిల్స్‌కు చెందిన భారత జవాను కశ్మీర్‌లోని గుల్‌మర్గ్ ప్రాంతంలోని ఎల్‌ఓసీ వద్ద జనవరిలో విధులు నిర్వహిస్తూ ప్రమాదవశాత్తూ మంచు కొండల్లోకి జారి పడ్డాడు. అయితే అతడి మృతదేహాన్ని కనుగొనడం సైన్యానికి కష్టమైంది. దీంతో జూన్‌లో నేగీని అమరవీరుడిగా ప్రకటించారు. అనంతరం జూన్ 21న ఈ విషయాన్ని దెహ్రాదూన్‌లోని బాధితుడి కుటుంబానికి ఓ లేఖ ద్వారా తెలియజేసింది సైన్యం.
అయితే నేగీ అమరుడయ్యాడన్న విషయాన్ని అతడి భార్య రాజేశ్వరి దేవి ఖండించింది. తన కళ్లతో మృతదేహాన్ని చూసే వరకు మరణించాడనే వార్తను అంగీకరించనని తేల్చి చెప్పింది.