తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కరోనా నియంత్రణలో మైనారిటీలూ కీలక పాత్ర'

కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు దేశంలోని ఇతరులతో సమానంగా మైనారిటీలు పాలుపంచుకుంటున్నారని పేర్కొన్నారు కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్​ అబ్బాస్​ నఖ్వీ. ప్రధాని, సీఎం సహాయ నిధులకు విరాళాలు, నిరుపేదలకు నిత్యావసరాలు, ఆహారం అందిస్తూ ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని తెలిపారు.

Naqvi
ముఖ్తార్​ అబ్బాస్​ నఖ్వీ

By

Published : May 9, 2020, 6:38 PM IST

Updated : May 9, 2020, 7:30 PM IST

కరోనాపై పోరులో దేశంలోని ఇతరులతో సమానంగా మైనారిటీ సమాజం పాలుపంచుకుంటోందని పేర్కొన్నారు కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తార్​ అబ్బాస్​​ నఖ్వీ. భౌతికదూరం పాటించటం సహా ఇతర అంశాలపై అవగాహన కల్పించేందుకు త్వరలోనే దేశవ్యాప్తంగా జాన్​ భి, జహాన్​ భి అవగాహన కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు.

" మైనారిటీ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలోని నైపుణ్యాభివృద్ధి కార్యక్రమంలో శిక్షణ తీసుకున్న 1500 మందికిపైగా ఆరోగ్య సహాయకులు.. దేశవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల్లో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు. వీరిలో 50 మంది అమ్మాయిలు ఉన్నారు. ఈ ఏడాది మరో 2000 మంది ఆరోగ్య సహాయకులకు శిక్షణ ఇవ్వనున్నాం. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రుల సహాయ నిధులకు వివిధ వక్ఫ్​ బోర్డులు సుమారు రూ. 51 కోట్లు అందించాయి. అలాగే నిరుపేదలకు ఆహారం, నిత్యావసరాలు అందిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న 16 హజ్​ హౌజులను క్వారంటైన్​, ఐసోలేషన్​ సౌకర్యాల కోసం ఇచ్చారు. వివిధ రాష్ట్రాలు వీటిని ఉపయోగిస్తున్నాయి. మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సీఖో ఔర్​ కమావో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమంలో భాగంగా భారీ సంఖ్యలో మాస్కులు తయారు చేసి.. అవసరమైన వారికి పంపిణీ చేశాం."

- ముఖ్తార్​ అబ్బాస్​ నఖ్వీ, కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి

కలిసికట్టుగా..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు కరోనా కట్టడికి దేశంలోని ప్రజలంతా కలిసికట్టుగా పోరాడుతున్నారని తెలిపారు కేంద్ర మంత్రి. ఇతర సమాజంలోని వ్యక్తులతో పాటు ఈ పోరాటంలో మైనారిటీలూ సమానంగా సహకరిస్తున్నారని నొక్కిచెప్పారు. అలీఘడ్​ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ) రూ.1.40 కోట్లు పీఎం కేర్స్​ నిధికి అందించినట్లు గుర్తు చేశారు. ఏఎంయూ వైద్య కళాశాలలో 100 పడకలు ఏర్పాటు సహా.. ఇప్పటివరకు 9వేలకుపైగా కరోనా పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు.

Last Updated : May 9, 2020, 7:30 PM IST

ABOUT THE AUTHOR

...view details