కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించి వైరస్ కట్టడికి కఠిన చర్యలు చేపట్టింది ప్రభుత్వం. దీనివల్ల విద్యార్థులు, అభ్యాసకులు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంట్లో ఖాళీగా ఉండటం వల్ల ప్రజలు విసుగు చెందుతారని భావించిన ప్రభుత్వం జ్ఞానాన్ని పెంచుకునేందుకు పలు డిజిటల్ లెర్నింగ్ ప్రోగ్రామ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (హెచ్ఆర్డీ) ఆన్లైన్ తరగతులను ప్రారంభించినట్లు ట్విట్టర్లో ప్రకటన చేసింది.
'స్వయం' ద్వారా..
భారత ప్రభుత్వం 'స్వయం' పేరుతో ఓ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీనిని విద్యావిధానంలోని మూడు ప్రధాన అంశాల సాధన కోసం రూపొందించారు. ఇందులో విభిన్న కోర్సులు అందుబాటులో ఉంటాయి. జనవరి 2020లో చేరిన విద్యార్థులు తమ కోర్సును కొనసాగించవచ్చు. మరింత సమాచారానికి www.swayam.gov.in ద్వారా తెలుసుకోవచ్చు.
విద్యార్థుల నేస్తం-'స్వయంప్రభ' ఛానల్
జీఎస్ఏటీ-15 ఉపగ్రహం ద్వారా ఎల్లప్పుడూ అత్యంత నాణ్యతతో విద్యా కార్యక్రమాలు ప్రసారం చేయడానికి రూపొందించిన 32 డీటీహెచ్ ఛానల్సే స్వయంప్రభ. ఇందులో విద్యార్థులకు అవసరమైన ప్రతి తాజా సమాచారాన్ని ప్రసారం చేస్తారు. ఇందులో విద్యార్థులు, నేర్చుకునేవారు తమకు కావల్సిన ప్రోగ్రాం ప్రసారమైన సమయాన్ని ఎంచుకుని వీక్షించే వెసులుబాటు ఉంటుంది. ఎన్పీటీఈఎల్, ఐఐటీలు, యూజీసీ, సీఈసీ, ఐజీఎన్ఓడబ్ల్యూ, ఎన్సీఈఆర్టీ, ఎన్ఐఓఎస్లు సమాచారాన్ని అందిస్తాయి. మెడిసిన్, ఇంజినీరింగ్, లా వంటి డిగ్రీ, పీజీ స్థాయి పాఠాలు, 9 నుంచి 12 తరగతుల వారి పాఠాలు ఉంటాయి. మరింత సమాచారం కోసం www.swayamprabha.gov.in లో లాగిన్ అయి తెలుసుకోవచ్చు.
నేషనల్ డిజిటల్ లైబ్రరీ
పాఠశాల, కళాశాల విద్యార్థులకు అవసరమైన పుస్తకాలను డిజిటల్ రూపంలో పొందేందుకు నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఉంచింది సర్కారు. తమకు అవసరమైన పుస్తకాలను దీనిద్వారా చదవొచ్చు. వెబ్ అడ్రెస్ www.iitkgp.ac.in .
పరిశోధనల సమాచారం కోసం శోధ్గానా..
భారతీయ పరిశోధనలకు సంబంధించిన సమాచారం తెలుసుకోవాలంటే 'శోధ్గానా'లో లాగిన్ కావాల్సిందే. ఇందులో ఎలక్ట్రానిక్ పరిశోధనలు, వ్యాసాలు అందుబాటులో ఉంటాయి. వెబ్ అడ్రస్ www.ssg.inflibnet.ac.in