మహిళలపై నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. ముఖ్యంగా లైంగిక వేధింపుల కేసుల్లో పోలీసులు తప్పనిసరిగా చర్యలు చేపట్టాలని సూచించింది.
ఈ నియమాలను కచ్చితంగా పాటించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలిచ్చింది కేంద్ర హోంశాఖ. వీటిని ఉల్లంఘిస్తే బాధితులకు సరైన న్యాయం జరగదని పేర్కొంది.
హోంశాఖ లేఖలోని వివరాలు
మహిళలపై లైంగిక నేరాలు జరిగితే వారికి మద్దతుగా తీసుకోవాల్సిన చర్యలు మీ దృష్టికి తీసుకొస్తున్నాం. అవేంటంటే
- విచారణార్హమైన నేరాల్లో క్రిమినల్ ప్రొసిడ్యూర్ కోడ్- సెక్షన్ 154, సబ్ సెక్షన్(1) ప్రకారం తప్పనిసరిగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి.
- పోలీస్ స్టేషన్ పరిధికి వెలుపల మహిళలపై నేరాలు జరిగితే జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి.
- విచారణార్హమైన నేరాల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయని ప్రభుత్వ ఉద్యోగిపై ఐపీసీ సెక్షన్ 166ఏ(సీ) ప్రకారం శిక్ష విధించే అవకాశం ఉంటుంది.
- సీఆర్పీసీ సెక్షన్ 173 ప్రకారం అత్యాచార సంబంధిత కేసుల దర్యాప్తు రెండు నెలల్లో పూర్తి చేయాలి. దర్యాప్తు ప్రక్రియను పర్యవేక్షించేందుకు లైంగిక నేరాల దర్యాప్తు నిఘా వ్యవస్థ(ఐటీఎస్ఎస్ఓ)ను కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసింది. ఇది పోలీసులకు అందుబాటులో ఉంటుంది.
- అత్యాచార/లైంగిక దాడి జరిగినప్పుడు బాధితులను 24 గంటల్లోగా వైద్య పరిశీలనకు తీసుకెళ్లాలి(సీఆర్పీసీ సెక్షన్ 164ఏ).
- భారతీయ ఆధారాల చట్టం- 1872 ప్రకారం.. బాధితులు చనిపోతే వారి చివరి వాంగ్మూలంలోని వివరాల ఆధారంగా మరణానికి ప్రధాన కారణాన్ని గుర్తించాలి. జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ లేదా ఇతరుల సమక్షంలో వివరాలు సేకరించలేదన్న కారణంతో వారి వాంగ్మూలాన్ని తిరస్కరించకూడదు.
- లైంగిక నేరాల్లో ఫోరెన్సిక్ ఆధారాలు సేకరించడం, సంరక్షించడం, ఆధారాలను రవాణా చేయడానికి సంబంధించి డైరెక్టరేట్ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్స్ సర్వీసెస్(డీఎఫ్ఎస్ఎస్) మార్గదర్శకాలు జారీ చేసింది. ఇందుకోసం బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చి అండ్ డెవలప్మెంట్.. లైంగిక దాడుల ఆధారాల సేకరణ(ఎస్ఏఈసీ) కిట్లను ప్రతీ రాష్ట్రానికి పంపించింది.
- చట్టంలో కఠినమైన నిబంధనలు ఉండి, సామర్థ్యం పెంచే చర్యలు చేపట్టినప్పటికీ.. ఈ మార్గదర్శకాలను పాటించకపోతే దేశంలో న్యాయం జరిగేలా చేయడం కష్టమవుతుంది. ముఖ్యంగా మహిళలపై నేరాల్లో న్యాయం జరిగేలా చేసేందుకు కఠినతరమవుతుంది. కాబట్టి ఈ నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోండి.
ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులకు ఇదే తరహా ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు సూచించింది హోంశాఖ. మహిళలకు సంబంధించిన నేరాల్లో దర్యాప్తుపై పర్యవేక్షణ పెంచి.. సరైన సమయంలో ఛార్జిషీట్ నమోదయ్యేలా చూడాలని ఆదేశించింది. నిందితులకు చట్టప్రకారం సకాలంలో శిక్ష పడేలా చూడాలని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి-అయోధ్య రామాలయం ప్రాంతానికి శిలల తరలింపు