కరోనా వైరస్ భారత్‌లోని పలు నగరాల్లో వ్యాపిస్తోంది. తాజాగా గురుగ్రామ్‌లోని ఓ పేటీఎం ఉద్యోగికి కరోనా వైరస్ సోకింది. ఫలితంగా దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 29కి చేరింది. ఇటీవలే ఇటలీ విహారయాత్రకు వెళ్లొచ్చిన తమ సంస్థ ఉద్యోగికి కరోనా సోకినందున పేటీఎం అప్రమత్తమైంది. తమ ఉద్యోగులను కొద్ది రోజుల పాటు ఇంటి వద్ద నుంచే పనిచేయాలని విజ్ఞప్తి చేసింది. అయితే దీని వల్ల తమ సంస్థ రోజువారీ కార్యకలాపాలకు ఎలాంటి ఇబ్బంది కలగదని సంస్థ స్పష్టం చేసింది.
పరీక్షలకు మాస్కులు
కరోనా వ్యాప్తి తీవ్రమవుతున్న నేపథ్యంలో 10, 12వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు... మాస్కులు, హ్యాండ్ శానిటైజర్లు ఉపయోగించేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) అనుమతిచ్చింది.
రైల్వేలో ప్రత్యేక వార్డులు తప్పనిసరి
కరోనా నివారణకు భారత రైల్వే చర్యలు చేపట్టింది. రైల్వే ఆధ్వర్యంలోనే ప్రతి డివిజనల్, సబ్ డివిజనల్ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాలని ముఖ్య వైద్యాధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
కరోనా సోకలేదు!
ఉత్తర్‌ప్రదేశ్ నోయిడాలో... జనవరి 15 నుంచి విదేశాలకు వెళ్లివచ్చిన 370 మందిని వైద్యాధికారులు ప్రత్యేకంగా (నిఘా) పర్యవేక్షిస్తున్నారు. అయితే వీరెవరికీ కరోనా వైరస్ సోకినట్లు నిర్ధరణ కాలేదని తెలిపారు.