దేశంలో భారీ జలాశయాలు నిర్మించేందుకు అనువైన ప్రదేశాలు లేవని పేర్కొన్నారు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. ఈ నేపథ్యంలో భూగర్భ జలాలను పెంచాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. దాని ద్వారా నీటి భద్రత లభిస్తుందన్నారు. దిల్లీలో నిర్వహించిన నేషనల్ వాటర్ అవార్డ్స్ కార్యక్రమంలో ఈ మేరకు వ్యాఖ్యానించారు సింగ్.
భూగర్భ జలాల పెంపు, భూగర్భ జలాశయాల గుర్తింపుపై జలశక్తి మంత్రిత్వ శాఖ పనులు ప్రారంభించినట్లు తెలిపారు కేంద్రమంత్రి.
"ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితుల్లో మరిన్ని పెద్ద పెద్ద డ్యాంలు నిర్మించగలమని అనుకోవట్లేదు. అలాంటి భౌగోళిక ప్రదేశాలు అందుబాటులో ఉండకపోవచ్చు. ప్రతి అంశాన్ని పరిశీలిస్తున్నాం. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ నిర్మిస్తాం. ఈ రోజు ఉన్న పరిస్థితులను చూస్తే.. వేళ్లపై లెక్కించే ప్రదేశాలు కూడా మనకు లేవు."
- గజేంద్ర సింగ్ షెకావత్, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి.