కరోనాతో లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో ఆగిపోయిన విమాన సర్వీసులు దాదాపు రెండు నెలల తర్వాత మళ్లీ ప్రారంభమయ్యాయి. సోమవారం ఒక్క రోజే 532 దేశీయ విమాన సర్వీసులు నడిచాయని.. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి వెల్లడించారు. ఈ విమానాల్లో మొత్తం 39,231 మంది ప్రయాణం చేసినట్లు తెలిపారు.
దిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయం నుంచి 243 విమానాలు రాకపోకలు సాగించాయి. దిల్లీకి వచ్చిన విమానాలు 118 కాగా.. దేశ రాజధాని నుంచి 125 విమానాలు బయటకు వెళ్లినట్లు అధికారులు తెలిపారు. మరో 82 విమాన సర్వీసులు రద్దయ్యాయి. మున్ముందు ఈ సర్వీసుల సంఖ్య మరింతగా పెరుగుతుందని పేర్కొన్నారు.