సాగు చట్టాలపై ప్రతిష్టంభన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కు ఢోకా ఉండదని హామీ ఇచ్చారు. ఎంఎస్పీ ప్రస్తుతం ఉందని, ఇకపైనా కొనసాగుతుందని స్పష్టం చేశారు. అదే విధంగా ప్రజా పంపిణీ వ్యవస్థ సైతం కొనసాగుతుందని తెలిపారు.
రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని.. కేంద్రం-రైతుల మధ్య అనేక దఫాల చర్చలు జరిపాయని చెప్పారు మోదీ. వ్యవసాయ చట్టాలపై రైతుల అభ్యంతరాలను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. అయితే, వారి ఆందోళనలకు కారణం ఏంటో తెలియట్లేదని అన్నారు. ఈ చట్టాల అమలు కోసం ఒక్క అవకాశం ఇవ్వాలని మోదీ కోరారు. ఈ సందర్భంగా అన్నదాతల సంక్షేమానికి కేంద్రం తీసుకొచ్చిన పథకాల గురించి వివరించారు.
"చట్టాల్లో ఉన్న అభ్యంతరాలు ఏంటో చెప్పట్లేదు. రైతుల ఆందోళనలకు కారణం ఏంటో తెలియట్లేదు. రైతుల కోసం కిసాన్ క్రిడెట్, ఫసల్ బీమా యోజన తెచ్చాం. ఈ పథకాన్ని మరింత విస్తరిస్తాం. చిన్న, సన్నకారు రైతుల కోసం పింఛను పథకం తెచ్చాం. గ్రామ్ సడక్ యోజన్ ద్వారా గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మారుస్తాం. దశాబ్దాలుగా వ్యవసాయ రంగంలో సంస్కరణలు నిలిచిపోయాయి. సమస్యలను సమష్టిగా చర్చించుకుని పరిష్కరించుకోవాలి"