తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కోమాలో ఆరోగ్య రంగం.. పులిమీద పుట్రలా వైరస్​ల వీరంగం

కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను బెంబేలెత్తిస్తోంది. కంటికి కనిపించని అతి సూక్ష్మమైన జీవి మానవుడి మనుగడను ప్రశ్నిస్తోంది. అమేయ బలసంపన్నమైన చైనా వంటి దేశానికీ ఈ వైరస్‌ వెన్నులో చలి పుట్టిస్తోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలనూ అతలాకుతలం చేస్తోంది. ఐరోపా దేశాలు, అమెరికా వంటివే కిందులు మీదులవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో అభివృద్ధి చెందుతున్న దేశాల పరిస్థితి ఏమిటన్నది జవాబులేని ప్రశ్నగా మారింది. ఈ తరుణంలో 130 కోట్లకు పైబడి జనాభా ఉన్న భారతదేశ ఆరోగ్య చిత్రాన్ని ఒకసారి పునఃసమీక్షించుకోవలసిన అవసరం ఉంది.

minimum health facilities has nothing in india... daily increasing so many new cases
కొరతల కోమాలో ఆరోగ్య రంగం.. పెరుగుతోన్న రోగాలు

By

Published : Mar 8, 2020, 6:38 AM IST

భారత వైద్యరంగం ప్రజల సగటు ఆయుర్దాయాన్ని మెరుగుపరచడంలో, మాతాశిశు మరణాలను తగ్గించడంలో కొన్ని దశాబ్దాలుగా చెప్పుకోదగిన ప్రగతి సాధించినప్పటికీ- అనేక ఆరోగ్య ప్రాధాన్య అంశాల్లో తత్సమానమైన కృషి జరగలేదన్నది కఠోర వాస్తవం. అంతర్జాతీయ ఆరోగ్య ప్రమాణాలకు, లక్ష్యాలకు భారత్‌ సుదూరంలో ఉంది. జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల మధ్య సైతం ఆరోగ్య వ్యవస్థలు, సేవల అందుబాటులో తీవ్రమైన వ్యత్యాసాలున్నాయి. ఆరోగ్యవంతమైన ప్రజలు జాతి ఆర్థికాభివృద్ధికి ఆలంబనగా నిలుస్తారు. అందుకే ప్రపంచంలోని అనేక దేశాలు తమ స్థూల దేశీయోత్పత్తుల్లో అధిక శాతాన్ని ఆరోగ్య వ్యవస్థల నిర్మాణానికి కేటాయించి, భవితను సుస్థిరం చేసుకుంటున్నాయి. 190 ప్రపంచ దేశాల జాబితాలో తలసరి ఆరోగ్య వ్యయానికి సంబంధించి భారత్‌ 141వ స్థానంలో ఉండటం గమనార్హం. ఆరోగ్య రంగాన్ని కోవిద్‌-19 వైరస్‌ వణికిస్తున్న నేపథ్యంలో వ్యవస్థల్లోని బలహీనమైన అంశాలను చర్చించి, పునరావలోకనం చేసుకోవాల్సి ఉంది.

కేటాయింపుల్లో శీతకన్ను...

కేంద్ర బడ్జెట్లో ఈ ఆర్థిక సంవత్సరం ఆరోగ్య రంగానికి కేటాయించిన రూ.69 వేలకోట్లు జీడీపీలో ఒక శాతమే. దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు ఈ నిధులు ఏ మూలకూ సరిపోవు. స్థూల దేశీయోత్పత్తిలో కనీసం 2.5శాతం ఆరోగ్యానికి కేటాయించాలంటూ 2011లో ప్రణాళిక సంఘం నిర్దేశించిన లక్ష్యానికి నేటికీ ఆమడ దూరంలో ఉన్నాం. దేశ ప్రజల ఆరోగ్య రక్షణకోసం ‘ఆయుష్మాన్‌ భారత్‌’ కార్యక్రమాన్ని 2018 సెప్టెంబర్‌లో భారత ప్రధాని మోదీ ప్రారంభించారు. ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఆరోగ్య సంరక్షణ పథకంగా దీన్ని ప్రభుత్వం అభివర్ణిస్తోంది. అర్హత కలిగిన పేద కుటుంబాలకు దీని ద్వారా అయిదు లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పిస్తారు. సామాజిక, ఆర్థిక, కుల జనాభా గణాంకాల ప్రకారం దేశ జనాభాలో సుమారు 40శాతంగా ఉన్న 10 కోట్ల పేద కుటుంబాలు లేదా 50 కోట్ల ప్రజలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు అర్హులు. దాదాపు 72 లక్షల మంది రోగులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు. కానీ, ఆయుష్మాన్‌ భారత్‌ కింద కొన్ని వ్యాధులకు మాత్రమే చికిత్స సౌకర్యాలు ఉన్నాయి. 2022నాటికి 1.5లక్షల ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు సృష్టించాలనీ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు ఇందులో నాలుగోవంతు కేంద్రాలనూ నిర్మించలేకపోయారు. దేశంలో ‘ఆయుష్మాన్‌ భారత్‌’ అమలుకు బాధ్యత వహించే అత్యున్నత సంస్థ జాతీయ ఆరోగ్య సంస్థ (ఎన్‌హెచ్‌ఏ) వెలువరించిన ఓ నివేదిక బీమా చెల్లింపులకు సంబంధించి వివిధ రాష్ట్రాల మధ్య అంతరాలను ప్రస్ఫుటపరచింది. అధిక పేదరికం ఉన్న రాష్ట్రాలు (బిహార్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌) తక్కువ నిధులు వినియోగించుకున్నాయి.

భారత్‌లో అత్యధికంగా బీమా చెల్లింపులు చేస్తున్న రాష్ట్రం కేరళ. ఎక్కడ ఎక్కువ కేటాయింపు జరగాలో ఆయా రాష్ట్రాల్లో బీమా చెల్లింపులు తక్కువగా ఉండటం- ఈ పథకం గాడి తప్పుతోందనడానికి నిదర్శనం. సామాజిక ఆర్థిక సూచీల ఆధారంగా గుర్తించిన దేశంలోని 115 ‘ఆశావహ’ జిల్లాల్లో కనీసం ఒక్క వైద్యశాల కూడా ఆయుష్మాన్‌ భారత్‌లో భాగస్వామ్యం కోరలేదు. ‘ఆశావహ జిల్లాల్లో’ ఈ పథకం కింద చేరేందుకు ప్రైవేటు ఆసుపత్రులు ఆసక్తి చూపడం లేదు. తొమ్మిది రాష్ట్రాల్లో విస్తరించిన ఈ జిల్లాల్లో ఏ ఒక్క ప్రైవేటు ఆసుపత్రీ ఇందులో భాగస్వామి కాలేదు. మహారాష్ట్ర, ఉత్తరాఖండ్‌ మినహా ఇతర రాష్ట్రాల్లో అభివృద్ధి చెందిన జిల్లాల్లో మాత్రమే ప్రైవేటు ఆసుపత్రులు పథకంలో భాగస్వామ్యం తీసుకున్నాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం భారత్‌లో 1,456 మందికి ఒక వైద్యుడు మాత్రమే ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) వెయ్యి మందికి ఒక వైద్యుడిని సిఫార్సు చేస్తోంది. ఈ నిష్పత్తిని మెరుగుపరచడానికి, వైద్యుల సంఖ్య పెంచడానికి జిల్లా ఆసుపత్రులకు అనుబంధంగా వైద్య కళాశాలల్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 526 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉన్నాయి. గడచిన రెండేళ్లలో ఈ కళాశాలల్లోని 82 వేలసీట్లు ప్రస్తుతం లక్షకు పెరిగాయి. ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రుల మధ్య అంతరాలు నానాటికీ అధికమవుతున్నాయి. దేశంలోని 58శాతం ఆసుపత్రులు, 29శాతం ఆసుపత్రి పడకలు ప్రైవేటు రంగంలోనే ఉన్నాయి. మొత్తం 81శాతం వైద్యులు ప్రైవేటు రంగంలోనే పని చేస్తున్నారు. తగిన సామర్థ్యం ఉన్న పెద్ద ఆసుపత్రుల్లో నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ కింద పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులు అందించాలన్నది ప్రభుత్వ ఆలోచన.

వైద్య విద్యారంగాన్ని ప్రభుత్వ పరిధి నుంచి తొలగించే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ పరిధిలోని అనేక ఆసుపత్రుల్లో ఎంబీబీఎస్‌ దాటి శిక్షణ ఇచ్చే సౌకర్యాలు అరకొరగా ఉన్నాయి. నిష్ణాతులైన వైద్యుల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. దేశంలోని కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో ప్రభుత్వం కల్పించిన పన్ను మినహాయింపుల ఆధారంగా త్వరితగతిన అన్ని రకాల అత్యుత్తమ శ్రేణి వైద్యపరికరాలను సమకూర్చుకుంటారు. ప్రైవేటు రంగంలోని వైద్యుల్లో కొందరికి విదేశాల్లో ప్రత్యేక శిక్షణ సైతం ఇప్పించుకోగలుగుతున్నారు. వీరి సేవలను వినియోగించుకుంటూ ‘నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌’ ద్వారా పీజీ కోర్సుల్లో వైద్య విద్యార్థులను చేర్చుకునే వెసులుబాటూ ఉంది. ఈ విద్యార్థుల్లో అనేకమందిని కేవలం డ్యూటీ డాక్టర్లుగా పనిచేయించుకుని, రోగులను కనీసం పలకరించే అవకాశాలూ ఇవ్వకుండానే పట్టాలు ఇచ్చి బయటకు పంపుతున్నారన్నది కఠిన వాస్తవం. జిల్లా ఆసుపత్రులను ప్రైవేటు వైద్య కళాశాలలతో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో అనుసంధానం చేయాలన్నది నీతి ఆయోగ్‌ ప్రతిపాదన. అనేక ప్రైవేటు వైద్య కళాశాలలకు అనుబంధంగా ఉండాల్సినంతటి పెద్ద ఆసుపత్రులు లేవు. ప్రైవేటు వైద్య కళాశాలలు ఆసుపత్రులనూ ఏర్పాటు చేసుకునేందుకు తక్కువ ధరకు భూమి కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. ఈ ఆలోచనపట్ల కొన్ని రాష్ట్రాలకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ప్రైవేటు వైద్య కళాశాలలను జిల్లా ఆసుపత్రులతో అనుసంధానిస్తే వైద్యుల కొరతను పూర్తిగా తీర్చగలమన్న మాట సత్యదూరం.

మౌలిక వసతులు అంతంతమాత్రం

దేశంలో ప్రాధాన్య వైద్యంలో మౌలిక సదుపాయాల కొరత చాలా ఉంది. రాబోయే అయిదేళ్లలో దేశంలో ప్రాధాన్య వైద్య సంరక్షణ, మౌలిక సదుపాయాల కల్పనకు రూ.5,38,305 కోట్లు అవసరం. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ డిమాండును 15వ ఆర్థిక కమిషన్‌ ముందుంచింది. అయినా మౌలిక వసతుల కల్పనకు ఉదారంగా కేటాయింపులు జరిపిన దాఖలాలే లేవు. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయవలసిన అవసరం ఉంది. ప్రపంచంలోని ఆరోగ్యకర దేశాల జాబితాలో భారత్‌ 120వ స్థానంలో ఉంది. స్పెయిన్‌- ప్రపంచంలోని అత్యంత ఆరోగ్యకరమైన దేశంగా అవతరించింది. ఇటలీ రెండో స్థానంలో ఉంది. కరోనా వైరస్‌ దాడికి విలవిల్లాడుతున్న దేశాల్లో ఇటలీ సైతం ఉండటం ఈ సందర్భంగా గమనార్హం. దక్షిణాసియాలోని శ్రీలంక (66వ స్థానం), బంగ్లాదేశ్‌ (91), నేపాల్‌ (110)లు భారత్‌కంటే మెరుగైన స్థితిలో ఉన్నాయి. కరోనా ఉదంతంతో వ్యవస్థీకృత లోపాలు మరింతగా కళ్లకు కడుతున్నాయి. దేశంలో అవసరాలకు సరిపడా వైరాలజీ ల్యాబ్‌లు లేవన్న వాస్తవం తొలుత స్పష్టమైంది. 1952లో స్థాపించిన ‘నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ’ దేశంలోనే అతి పెద్ద వైరాలజీ సంస్థ. ప్రపంచ ఆరోగ్య సంస్థతో అనుసంధానంతో వైరస్‌లపై అనేక అద్భుత పరిశోధనలు చేసిన ఘనత దానిది. దేశంలో ఏ వైరస్‌ ద్వారా ఉపద్రవం వచ్చినా ఆదుకొనే ఒకే ఒక్క సంస్థ ఇది.

నిజానికి ప్రతి రాష్ట్రంలోనూ ఇలాంటి సంస్థల ఆవశ్యకత ఉంది. అన్ని రాష్ట్రాలనుంచి రక్త నమూనాలను ఇక్కడికే పంపాల్సి రావడంవల్ల కొన్నిసార్లు జాప్యం జరుగుతోంది. అందుకే దేశంలో ఇలాంటి అనేక వైరాలజీ ల్యాబ్‌లను స్థాపించాల్సి ఉంది. తక్కువ కాలవ్యవధిలో భారీగా విస్తరించే అంటువ్యాధుల మూలాలను తెలుసుకునేందుకు, కరోనా వంటి వైరస్‌లను గుర్తించి వాటి లక్షణాలను విశ్లేషించేందుకు ఈ తరహా ల్యాబ్‌లు దోహదపడతాయి. కరోనా తరహా ఉపద్రవాలు ముంచుకొచ్చినప్పుడు మేల్కొని, ఆరోగ్య వ్యవస్థల ఏర్పాటుపై గొంతెత్తి, ఆపై మౌనంగా ఉండిపోయే ధోరణివల్ల సంక్షోభాలు విరుచుకుపడుతూనే ఉంటాయి. నోట్ల రద్దు, జీఎస్‌టీ కారణంగా దేశీయ ఫార్మా రంగం కుదేలైంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రంగానికి పెద్దయెత్తున ప్రోత్సాహకాలు, పెట్టుబడులు అవసరం. పరిశోధన రంగానికీ చురుకు పుట్టించాల్సి ఉంది. అనేక మందులకు ముడిపదార్థాలను చైనా సరఫరా చేస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో చైనా మీద ఆధారపడటం సహేతుకం కాదు. పెద్దమొత్తంలో మందుల తయారీకి దేశీయ ఫార్మా రంగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ప్రజారోగ్యం, అభివృద్ధి ఒకదానితో ఒకటి మిళితమైన రెండు పార్శ్వాలు. అనారోగ్య పీడిత దేశం అన్ని విధాలుగా అభివృద్ధికి దూరమవుతుంది. కాబట్టి, దప్పిక వేసినప్పుడు బావి తవ్వే తరహా ప్రయత్నాలను పక్కనపెట్టి- దేశ ఆరోగ్య రంగం అవసరాలను దృష్టిలో పెట్టుకుని వ్యవస్థలను పటిష్ఠంగా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరాన్ని విధానకర్తలు గుర్తించాల్సిన సందర్భమిది.

సామర్థ్యం పెంపుదలే మార్గం

ఇటీవల జాతీయ నమూనా సర్వే సంస్థ నివేదిక- నిరుడు ఇతర వ్యాధులతో పోలిస్తే అత్యధిక సంఖ్యలో భారతీయులు సాంక్రామిక వ్యాధులకు గురైనట్లు వెల్లడించింది. ఈ వ్యాధుల్లో మలేరియా, వైరల్‌ హెపటైటిస్‌, తీవ్రమైన విరేచనాలు, డెంగీ, చికున్‌ గన్యా, తట్టు, మెదడువాపు, టైఫాయిడ్‌, బోదకాలు, క్షయ వంటివి ఉన్నాయి. ఈ సమస్యలను ఎదుర్కొనేందుకు ప్రభుత్వ పెద్దయెత్తున నిధులు కేటాయించాలి. సాధారణ వ్యాధుల కట్టడికే నిధుల్లేక కొట్టుమిట్టాడుతున్న పరిస్థితుల్లో, తాజాగా కోరచాస్తున్న కరోనా వంటి వైరస్‌ను ఎదుర్కోవడానికి మరెంత సన్నద్ధత కావాలి? విరుచుకుపడే ఈ ఉత్పాతాలను ఎదుర్కొనేందుకు వైద్యరంగం సామర్థ్యం ఇనుమడించేలా భారీగా నిధులు కేటాయించడం తప్పనిసరని ప్రభుత్వాలు ఇప్పటికైనా గుర్తించాల్సి ఉంది.

డాక్టర్ శ్రీభూషణ్ రాజు

(రచయిత- హైదరాబాద్​ నిమ్స్​లో నెఫ్రాలజీ విభాగాధిపతి)

ABOUT THE AUTHOR

...view details