అయోధ్యలో రామమందిర నిర్మాణ బాధ్యతలు చూస్తున్న శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ బ్యాంక్ ఖాతాల నుంచి నకిలీ చెక్‌లతో భారీగా నగదు విత్‌డ్రా అయింది. ట్రస్ట్‌కు చెందిన రెండు ఖాతాల నుంచి గుర్తు తెలియని వ్యక్తులు సొమ్ము కాజేశారు. ఇప్పటికే రెండు సార్లు భారీ మొత్తంలో నగదును ఉపసంహరించారు. మూడోసారి కూడా డబ్బులు విత్‌డ్రా చేసేందుకు ప్రయత్నించగా.. ట్రస్ట్ జనరల్ సెక్రటరీ సంపత్ రాయ్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందింది.
సెప్టెంబరు 1న లఖ్‌నవూలోని ఓ బ్యాంకు ఖాతా నుంచి లక్షన్నర రూపాయలను దుండగులు చెక్ ద్వారా డ్రా చేశారు. రెండురోజుల తర్వాత మరో మూడున్నర లక్షలను ఖాతా నుంచి ఉపసంహరించారు. ఆ తర్వాత మరోసారి బ్యాంకుకు వెళ్లారు. బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకు నుంచి రూ.9.86 లక్షలు విత్ డ్రా చేసేందుకు ప్రయత్నించగా బ్యాంకు సిబ్బందికి అనుమానం వచ్చింది. క్రాస్ చెక్ కోసం అయోధ్య రామజన్మభూమి ట్రస్ట్‌కు కాల్ చేసి అడిగారు. తాము ఎటువంటి చెక్‌ను జారీ చేయలేదని.. ఎలాంటి చెల్లింపులు చేయకూడదని స్పష్టం చేయడం వల్ల ఈ మోసం వెలుగులోకి వచ్చింది.