తెలంగాణ

telangana

By

Published : Feb 26, 2020, 4:36 PM IST

Updated : Mar 2, 2020, 3:43 PM IST

ETV Bharat / bharat

దిల్లీలో పాలు, కూరగాయల ధరలకు రెక్కలు

సీఏఏ నిరసనల్లో హింస చెలరేగిన నేపథ్యంలో ఈశాన్య దిల్లీలోని పలు ప్రాంతాల్లో పాలు, కూరగాయల ధరలు అమాంతం పెరిగాయి. ఉద్రిక్త పరిస్థితుల కారణంగా దుకాణాలు మూతపడ్డాయి.

milk-vegetable-prices-up-
దిల్లీలో పాలు, కూరగాయల ధరలకు రెక్కలు

సీఏఏ వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య ఘర్షణల కారణంగా దేశ రాజధాని దిల్లీలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఉద్రిక్త పరిస్థితుల కారణంగా దుకాణాలు మూతపడి రోడ్లన్నీ బోసిపోయాయి. ఈ నేపథ్యంలో పాలు, కూరగాయలు వంటి నిత్యావసరాల ధరలు అమాంతం పెరిగాయి.

అల్లర్లు జరిగిన జఫ్రాబాద్​, మౌజ్పూర్​, బబుర్పూర్​, నూరిలాహి ప్రాంతాల్లో పలు దుకాణాలు తెరుచుకున్నా సరుకులు వెంటనే అమ్ముడైపోయాయి. భారీ డిమాండ్ దృష్ట్యా నిత్యావసర వస్తువులను ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారు వ్యాపారులు.

హింసాత్మక ఘటనల నేపథ్యంలో దిల్లీలోని పలు ప్రాంతాల్లో 144 సెక్షన్​ విధించారు . అల్లర్లలో ఇప్పటి వరకు 24మంది మృతిచెందారు. దాదాపు 200 మంది గాయపడ్డారు. అల్లరి మూకలను నియంత్రించేందుకు రెండు రోజుల పాటు నిబంధనలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు.

స్థానికుల ఇబ్బందులు..

ప్రస్తుతం వీధుల్లోకి వచ్చి నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయాలంటే ఇబ్బందిగా ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రూ.42గా ఉన్న లీటరు పాల ధర ఇప్పుడు రూ.50కి చేరిందని తెలిపారు. అల్లర్లు జరిగే ప్రాంతాల్లో త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇతర ప్రాంతాల నుంచి కూరగాయల సరఫరా రెండు రోజలుగా నిలిచిపోయిందని స్థానిక వ్యాపారి చెప్పారు. ఉద్రిక్త పరిస్థితుల కారణంగా వ్యాపారులు ఈ ప్రాంతాల్లోకి రావడానికి సుముఖంగా లేరని తెలిపారు.

పాల కొరత తీవ్రంగా ఉండటం వల్ల పిల్లలు ఇబ్బంది పడుతున్నారని ఓ స్థానిక గృహిణి ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: దిల్లీ అల్లర్లలో 24 మంది మృతి- ప్రభుత్వ 'బదిలీల' వ్యూహం

Last Updated : Mar 2, 2020, 3:43 PM IST

ABOUT THE AUTHOR

...view details