తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అమెరికా పొత్తు మంచిది కాదు- చైనాతో చర్చలు సాగించండి'

అమెరికాతో సైనిక పొత్తును కుదుర్చుకోవడం దేశ ప్రయోజనాలకు మంచిది కాదని వామపక్షాలు పేర్కొన్నాయి. అమెరికా భౌగోళిక రాజకీయ వ్యూహాల్లో పావుగా మారొద్దని కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి. చైనాతో సరిహద్దు వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించాయి.

Military alliance with US not in national interest; govt should keep negotiating with China: Left
'అమెరికా పొత్తు మంచిది కాదు- చైనాతో చర్చలు సాగించండి'

By

Published : Oct 29, 2020, 5:39 AM IST

అమెరికాతో సైనికపరమైన పొత్తు కుదుర్చుకోవడం దేశ ప్రయోజనాలకు శ్రేయస్కరం కాదని వామపక్ష పార్టీలు అభిప్రాయపడ్డాయి. చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి. అమెరికాతో మంగళవారం జరిగిన 2+2 చర్చల్లో 'బేసిక్ ఎక్స్​ఛేంజ్ అండ్ కోఆపరేషన్ అగ్రిమెంట్(బెకా)' సహా పలు కీలక ఒప్పందాలు కుదిరిన నేపథ్యంలో సీపీఐ, సీపీఎం బుధవారం ఓ సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి.

అగ్రరాజ్యంతో కుదుర్చుకున్న సైనిక ఒప్పందాలు భారత సమగ్రతపై, స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే హక్కుపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయని అందులో ఆందోళన వ్యక్తం చేశాయి. విదేశీ విధానాలపై కూడా వాటి ప్రభావం ఉంటుందని పేర్కొన్నాయి. ఆసియాలో అమెరికా అనుసరిస్తున్న భౌగోళిక రాజకీయ వ్యూహాల్లో పావుగా మారొద్దని కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి. చైనాతో సరిహద్దు వివాదాలను పరిష్కరించుకునేందుకు అత్యున్నత స్థాయిలో రాజకీయ, దౌత్యపరమైన చర్చలను కొనసాగించాలని కోరాయి.

ABOUT THE AUTHOR

...view details