లాక్‌డౌన్ పొడిగింపుతో పాటు ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడంతో వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎలాగైనా సరే స్వస్థలాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం నడుపుతున్న ప్రత్యేక రైళ్లు అందుబాటులోలేని వారు తమను సొంత ఊళ్లకు చేర్చమని కోరుతూ రోడ్లపైకి వచ్చి అధికారులను వేడుకుంటున్నారు. లాఠీదెబ్బలు తింటున్నారు. మరికొందరు వందల కిలోమీటర్ల దూరం నడిచి వెళుతూ మార్గమధ్యలో ఆకలితో అలమటిస్తున్నారు. ప్రమాదాలకు గురవుతున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూ నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని సొంత ఊరికి సైకిల్‌పై బయలుదేరిన వలస కార్మికుడు కృష్ణసాహూ, అతని భార్య ప్రమీల రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా వారి ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. వారి సైకిల్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
రోడ్డుపై బైఠాయించి...
గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ సమీప గోటా ప్రాంతంలో ఉత్తర్‌ప్రదేశ్, బిహార్‌కు చెందిన వలస కూలీలు దాదాపు 2000మంది శుక్రవారం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద రెండు గంటలపాటు బైఠాయించారు. ఊళ్లకు పంపాలని పట్టుబట్టిన వీరికి నచ్చచెప్పి వెనక్కి పంపేందుకు పోలీసులు చాలా కష్టపడాల్సి వచ్చింది. కర్ణాటకలోని మంగళూరులోనూ ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన దాదాపు 700మంది వలస కార్మికులు స్థానిక రైల్వేస్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. వీరందరూ మంగళూరు పరిసర ప్రాంతాల నుంచి కాలి నడకనే రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు.
ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ జిల్లాలోని ఒక క్వారంటైన్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 22 మంది వలస కూలీలు అధికారుల కళ్లుగప్పి తప్పించుకున్నారు. తమ సొంత ఊళ్లకు బయలుదేరారు.
పాఠశాలలకు ఉచితంగా రంగులు...
ఇటానగర్‌లో.. తమకు ఆశ్రయం కల్పించిన ఒక పాఠశాలకు ఉచితంగా రంగులు వేసి వలస కార్మికులు తమ కృతజ్ఞత చాటుకున్నారు. అరుణాచల్‌ప్రదేశ్‌లోని యుపియాలోని ఒక పాఠశాలలో అసోం నుంచి వచ్చిన వలస కార్మికులకు ఆశ్రయం కల్పించగా వారు ఆ పాఠశాలకు రంగులు వేసినట్లు అధికారులు తెలిపారు.