లాక్డౌన్ పెట్టిన తిప్పలకు వలస కూలీల గుండెలవిసిపోయాయి. సొంతగూటికి చేరేందుకు కొందరికి కాళ్లే చక్రాలయ్యాయి. ఉన్నదంతా అమ్ముకుని మరికొందరి బతుకులు దిగజారిపోయాయి. తాజాగా బెంగళూరు నుంచి ఒడిశాకు చేరేందుకు ఓ వలస కూలీ భార్య మంగళసూత్రాన్నే తాకట్టు పెట్టాడు.
ఒడిశా భద్రక్, బసుదేవ్పుర్కు చెందిన చందన్ జెనా, భార్యతో కలిసి పని కోసం బెంగళూరుకు వెళ్లాడు. కూలీ చేస్తే గానీ పూటగడవని బతుకులు వారివి. మరి, లాక్డౌన్ వేళ పనే లేకుండాపోయింది. లాక్డౌన్ ఎత్తేస్తే పని దొరుకుతుందని రెండు నెలలుగా ఎదురుచూశారు. కానీ, ఇప్పట్లో అది జరిగేపని కాదనుకున్నారు.
చేసేదేమీ లేక జెనా.. భార్యను, మరో స్నేహితుడిని వెంటబెట్టుకుని ఊరెళ్లిపోదామనుకున్నాడు. జేబులో చిల్లిగవ్వలేదు. ఊరుగాని ఊరు కాబట్టి అప్పు పుట్టే మార్గంలేదు. గత్యంతరం లేక భార్య మెడలో తాళిని రూ.15 వేలకు తాకట్టు పెట్టాడు. ఆ డబ్బుతో రెండు సైకిళ్లు కొన్నాడు.
సైకిళ్లు కొనేందుకు తాళి తాకట్టు పెట్టాడు! బెంగళూరు నుంచి సైకిల్ తొక్కుతూ.. ఒడిశాలోని కటక్‌కు చేరుకున్నారు. అక్కడ కొందరు సామాజిక కార్యకర్తల కంటపడ్డారు. జెనా కథ విని చలించిపోయిన వారు.. ఆ ముగ్గురికీ అన్నపానీయాలు అందించి, వారిని సొంతగూటికి చేర్చేందుకు ఓ వాహనం ఏర్పాటు చేసి ఆదుకున్నారు.
ఇదీ చదవండి:'భౌతిక దూరమే' ఆ గిరిజనుల సంప్రదాయం!