కరోనా సంక్షోభం నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ ఎంతో మంది జీవితాలను దుర్భర పరిస్థితుల్లోకి నెట్టేసింది. ముఖ్యంగా వలస కూలీల పరిస్థితి దారుణంగా తయారైంది. దేశవ్యాప్తంగా రవాణా సౌకర్యాలు నిలిచిపోవడం వల్ల వేలాది మంది వలసజీవులు తామున్న చోట పనుల్లేక స్వగ్రామాల బాటపట్టారు. అలాంటి వారికి ప్రభుత్వం ఇప్పుడు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినా అంతకుముందే ఎంతో మంది కాలిబాటన వందల కిలోమీటర్లు ప్రయాణించారు. ఈ నేపథ్యంలో పలువురు ప్రమాదాలకు గురవ్వగా మరికొందరు ఆస్పత్రుల పాలయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లోనే మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ వలసకూలీ హైదరాబాద్‌లో నివసిస్తూ.. నిండు గర్భిణి అయిన తన భార్య, రెండేళ్ల పాపతో కలిసి స్వస్థలానికి బయలుదేరాడు. ఆయన ప్రయాణం ఎలా సాగిందో మీరే చూడండి.
తోపుడు బండిపై భార్య, కూతురును కూర్చోబెట్టి..
మధ్యప్రదేశ్‌లోని బాలాకోట్‌కు చెందిన రాము, తన భార్య ధన్వంత (8 నెలల గర్భిణి), రెండేళ్ల కూతురు అనురాగిణితో స్వస్థలానికి పయనమయ్యాడు. అంతదూరం తన భార్య నడిచివెళ్లాలంటే ప్రమాదమని భావించి మార్గమధ్యలో చేతికి దొరికిన కట్టెలు, అట్టముక్కలతో తోపుడు బండిని తయారు చేశాడు. దానిపై భార్య, కూతుర్ని కూర్చోబెట్టిన రాము వందల కిలోమీటర్లు వారిని తీసుకెళ్లాడు. తినడానికి తిండి లేకున్నా అలాగే తన ప్రయాణం కొనసాగించాడు. రోడ్డున పోయే ఒకరు ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడం వల్ల విషయం వెలుగులోకి వచ్చింది.