బతుకుతెరువు కోసం వలస వెళ్లిన కూలీలు లాక్డౌన్ ధాటికి విలవిలలాడుతున్నారు. ఉపాధి లేక, తమ కుటుంబాలను పస్తులుంచలేక స్వస్థలాలకు పయనమవుతున్నారు. ఆ సుదీర్ఘ ప్రయాణంలో చెప్పలేనన్ని అగచాట్లు పడుతున్నారు. ఇలాంటి బాధితుల్లో సంజయ్ నాట్ ఒకడు.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని నాగ్లా తంగాడ్కు చెందిన సంజయ్ నాట్ ఉపాధి కోసం రాజస్థాన్‌లోని భరత్‌పుర్‌కు కుటుంబంతో సహా వలస వెళ్లాడు. అయితే లాక్డౌన్ కారణంగా సంజయ్‌కి పనిలేకుండా పోయింది. కుటుంబం పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఎదురయ్యింది. దీనితో చేసేదేం లేక తన స్వగ్రామానికి వెళ్లాలని నిశ్చయించుకున్నాడు.
లాక్డౌన్ వల్ల ప్రయాణ సౌకర్యాలు అందుబాటులో లేవు. స్వగ్రామానికి వెళ్లాలంటే వందలాది కిలోమీటర్లు నడిచిపోవాలి. కానీ చిన్న పిల్లలతో అంత దూరం వెళ్లడం చాలా కష్టం. దీనితో సొంతంగా ఓ ఎద్దుల బండి సమకూర్చుకోవాలని సంజయ్ నిర్ణయించుకున్నాడు.