తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మధ్యాహ్న భోజన పథకానికి అవినీతి చెద!

బడి ఈడు పిల్లల చిరు బొజ్జలకు పౌష్టికాహారం అందించడంతోపాటు, విద్యాబుద్ధులూ నేర్పేందుకు చేసిన గొప్ప ఆలోచనే మధ్యాహ్న భోజన పథకం. ఆందోళనకర అంశం ఏమిటంటే- దేశవ్యాప్తంగా పాఠశాలల్లో మధ్యాహ్న భోజన అవకాశాన్ని వినియోగించుకొంటున్న పిల్లల సంఖ్య గత మూడేళ్లలో 80లక్షలకుపైగా పడిపోయింది. భోజన నాణ్యత ప్రమాణాలు తగ్గడం, అక్రమాలు జరుగుతుండడమే ఇందుకు కారణం. దీనిపై ప్రభుత్వాలు యుద్ధప్రాతిపదిక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

By

Published : Sep 10, 2019, 5:23 PM IST

Updated : Sep 30, 2019, 3:38 AM IST

మధ్యాహ్న భోజనానికి అవినీతి ఎసరు!

సమున్నత ఆదర్శాల వల్లెవేతతో ప్రారంభించిన ఎన్నో పథకాలు సక్రమ కార్యాచరణ కొరవడి నీరోడుతున్న దేశం మనది. బడి ఈడు పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు భరోసా ఇచ్చేలా ఏనాడో 1940ల్లోనే అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాలు మొదలుపెట్టిన సార్వత్రిక మధ్యాహ్న భోజన పథకానికి 1995లో భారత్‌ శ్రీకారం చుట్టింది. రెక్కాడితేగాని డొక్కాడని పేద కుటుంబాల్లోని పసివాళ్లకు పోషకాహారాన్ని అందించే లక్ష్యంతో అది మొదలైంది. తరతరాల పేదరిక విషవలయాన్ని ఛేదించి, బడి ఈడు పిల్లల చిరు బొజ్జలకు పౌష్టికాహారం అందించడంతోపాటు, విద్యాబుద్ధులూ నేర్పేందుకు ఉద్దేశించిన మధ్యాహ్న భోజన పథకం ఎంతో విశిష్టమైనదే.

ఆందోళనకర అంశం ఏమిటంటే- దేశవ్యాప్తంగా పాఠశాలల్లో మధ్యాహ్న భోజన అవకాశాన్ని వినియోగించుకొంటున్న పిల్లల సంఖ్య గత మూడేళ్లలో 80లక్షలకుపైగా పడిపోయింది. 2015-’16లో పదికోట్ల మంది పిల్లలు మధ్యాహ్న భోజనం పథకం పరిధిలో ఉండగా 2018-’19 నాటికి వారి సంఖ్య తొమ్మిది కోట్ల 17 లక్షలకు దిగివచ్చిందని సర్కారీ గణాంకాలే చాటుతున్నాయి. దీనికి తోడు చిన్నారులకు అందిస్తున్న ఆహారం నాణ్యత ప్రమాణాలు దిగనాసిగా ఉంటున్నాయని, పథకం అమలులో అక్రమాలు విక్రమిస్తున్నాయన్న ఆరోపణల ఉరవడి ఏటికేడు పెరుగుతోందేగాని తగ్గడం లేదు.

‘బోధనేతర పనుల్లో ఉపాధ్యాయులు, చదువు సంధ్యలపై దాని ప్రభావం’ పేరిట నిరుడు జాతీయ స్థాయిలో నిర్వహించిన అధ్యయన ఫలితాలు- మరో చీకటి కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయిప్పుడు! ఎన్నికల విధులు, పల్స్‌ పోలియో ప్రచారాలు, మధ్యాహ్న భోజన రిజిస్టర్లతో టీచర్లు కుస్తీ పడుతుండటంతో వారి పని గంటల్లో అయిదోవంతు కూడా చదువు చెప్పేందుకు మిగలడం లేదని ఆ అధ్యయనం నివేదించింది. అరకొర నిధులు ఆలస్యంగా అందుతుండటం, చౌక ధరల దుకాణాలనుంచి సరకుల్ని తెచ్చినా నిల్వ సదుపాయాలు లేకపోవడం వంటివి ఉపాధ్యాయుల్ని తీవ్ర ఒత్తిడికి లోను చేస్తున్నాయి. ఫలితంగా- సరైన భోజనంతోపాటు, తీరైన చదువులకూ కోట్లాది పసిపిల్లలు మొహం వాచిపోయే దుస్థితి అన్ని చోట్లా తాండవిస్తోంది. యుద్ధ ప్రాతిపదికన దిద్దుబాటు చర్యలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధం కావాల్సిన సమయమిది!

గొప్ప ఆశయం నీరుగారుతున్న వైనం

పాఠశాలల్లోకి పిల్లల ప్రవేశాల్ని, రోజువారీ హాజరీని పెంచడంతోపాటు వారి పౌష్టికాహార స్థాయిని ఇతోధికం చేయడమే లక్ష్యంగా- ‘ప్రాథమిక విద్యకు పౌష్టికాహార దన్ను’ను జాతీయ పథకంగా 1995 స్వాతంత్య్ర దినోత్సవం నాడు కేంద్రం ప్రారంభించింది. 2001నుంచి మధ్యాహ్న భోజన వడ్డన పథకంగా రూపాంతరం చెందిన ఆ చొరవ- ప్రతి విద్యార్థికి రోజుకు 300 క్యాలరీలు, 8-12 గ్రాముల మాంసకృత్తులు ఏడాదికి కనీసం రెండొందల రోజులపాటు అందించాలని నిర్దేశించింది. ప్రాథమిక తరగతుల పిల్లలకు 450 క్యాలరీలు, 12 గ్రాముల మాంసకృత్తులు, ప్రాథమికోన్నత విద్యార్థులకు 700 క్యాలరీలు 20 గ్రాముల మాంసకృత్తులు అందించాలంటూ మధ్యాహ్న భోజన పథకాన్ని పరిపుష్టీకరించినా, ఆ మేరకు ప్రయోజనం కోట్లమంది విద్యార్థులకు అందని ద్రాక్షగానే ఊరిస్తోంది.

యూపీలోని మీర్జాపూర్‌ ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు ఒకసారి అన్నం- ఉప్పు, మరోసారి రొట్టెలు- ఉప్పు వడ్డించిన వైనాన్ని వారం రోజులనాడు వీడియో తీసిన పాత్రికేయుడిపై రాష్ట్ర ప్రభుత్వం ‘కుట్ర’ కేసు నమోదు చేసింది. అలా ‘ఉప్పు’డు మెతుకుల వడ్డన ఎప్పుడూ ఉన్నదేనని విద్యార్థులే చెబుతుంటే, యూపీలోని ప్రతి జిల్లాలో 20 గ్రామాల్లో మధ్యాహ్న భోజన పథకంపై ‘ఆడిట్‌’ నిర్వహించనున్నట్లు యూపీ సర్కారు ప్రకటించింది.

2013లో బిహార్లోని ఓ గ్రామంలో విష కలుషిత మధ్యాహ్న భోజనం తిని 27మంది పిల్లలు మృత్యువాత పడిన దైన్యం, 2004లో తమిళనాట కుంభకోణంలో వంటశాలలో రేగిన మంటలు 94మంది పిల్లల్ని బలిగొన్న విషాదం జాతి గుండెల్ని మెలిపెట్టినా- ఎక్కడికక్కడ నిర్వహణ యంత్రాంగం గుణపాఠాలు నేర్వనే లేదు. మధ్యాహ్న భోజనం అధ్వానంగా ఉందంటూ మూడేళ్లలో 15 రాష్ట్రాల నుంచి 35 ఫిర్యాదులు అందాయని, 900 మంది పిల్లలు అస్వస్థులయ్యారని మొన్న జులైలో పేర్కొన్న కేంద్రం- ఓ ఉదాత్త ఆశయాన్ని కబళిస్తున్న నిష్పూచీతనంపై కత్తిదూయక తప్పదు!

కునారిల్లుతున్న బాల్యం

దేశవ్యాప్తంగా మూడోవంతు పిల్లలు పౌష్టికాహార లోపంతో కునారిల్లుతున్నారన్న జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే- 37.5 శాతం బలహీనంగా, 38.4 శాతం వయసుకు తగ్గ ఎత్తు, 21 శాతం ఎత్తుకు తగ్గ బరువు లేకుండా గిడసబారిపోతున్నారన్న బాధాకర వాస్తవాన్ని వెల్లడించింది. పిల్లల శారీరక, మానసిక, బుద్ధి కుశలతల వికాసానికి ఆరోగ్యకరమైన సమతుల ఆహారం ఉండి తీరాలి.

19 కోట్ల జనావళి రోజూ పస్తులతోనే నిద్రపోతున్న దేశంలో సర్కారీ బళ్లు- నిరుపేద పిల్లలకు అన్నం పెట్టే దేవుళ్లు! భావితరాన్ని ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దాలంటే, మధ్యాహ్న భోజన పథకాన్ని బలవర్ధకంగా తీర్చిదిద్దాలన్న సూచనల్ని ఏమాత్రం విస్మరించే వీల్లేదు. భోజనం తరవాత చదువుపై శ్రద్ధ పెట్టగలుగుతున్నామని 72శాతం, ఆహారం రుచికరంగా ఉందని 87 శాతం పిల్లలు చెప్పారన్న కేంద్రం సొంత సర్వే భజంత్రీల వెన్నంటే, పథకం అమలు ఎంత దిగనాసిగా ఉందో ‘కాగ్‌’ నివేదికలు ఎలుగెత్తుతున్నాయి. మధ్యాహ్న భోజనం చేస్తున్న విద్యార్థుల సంఖ్యను అధికంగా చూపడం, ఆహార ధాన్యాల దారి మళ్ళింపు, రవాణా ఖర్చులు ఇతరత్రాలను భారీగా పెంచడం వంటి అక్రమాలను వేలెత్తి చూపిన ‘కాగ్‌’- సర్కారీ స్కూళ్లలో పడిపోతున్న విద్యార్థుల సంఖ్య, మేలిమి చదువులే ముఖ్యమన్న తల్లిదండ్రుల మనోగతానికి సంకేతమంటోంది. మధ్యాహ్న భోజన పథక రజతోత్సవ సంవత్సరమిది. దీపం కింద చీకటిలా తారట్లాడుతున్న అవినీతి, అక్రమాలను ఊడ్చేసి, నిష్ఠగా పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వాలు నిబద్ధమైతేనే- జాతికి ఆరోగ్యకర ప్రగతి!

ఇదీ చూడండి: 'నాయకుడు కావాలంటే.. కలెక్టర్​ కాలర్ పట్టుకోండి'

Last Updated : Sep 30, 2019, 3:38 AM IST

ABOUT THE AUTHOR

...view details