ఆకలిమంటల్లో బడిఈడు పిల్లల బాల్యం, చదువు కమిలిపోరాదన్న సదుద్దేశంతో దాదాపు పాతికేళ్లక్రితం దేశంలో రూపుదాల్చిన విశిష్ట పథకం- ‘మధ్యాహ్న భోజనం’. అది నేటికీ అనేక రాష్ట్రాల్లో తప్పటడుగులు వేస్తుండటం దురదృష్టం. ‘ప్రాథమిక విద్యకు పౌష్టికాహార దన్ను’గా తొలుత నిర్దేశించిన మేరకు ప్రతి విద్యార్థికీ రోజుకు 300 క్యాలరీలు, 8-12 గ్రాముల మాంసకృత్తులు ఏడాదిలో కనీసం రెండువందల రోజులపాటు అందించాలి. దరిమిలా ప్రాథమిక తరగతుల్లోనివారికి 450 క్యాలరీలు, 12 గ్రాముల మాంసకృత్తులు; ప్రాథమికోన్నత విద్యార్థులకు 700 క్యాలరీలు, 20 గ్రాముల మాంసకృత్తులు సమకూడేలా పథకాన్ని పరిపుష్టీకరించారు. బడిఈడు పిల్లలకు మధ్యాహ్న భోజనం చట్టబద్ధ హక్కుగా సర్వోన్నత న్యాయస్థానమే స్పష్టీకరించినా- వాస్తవిక కార్యాచరణలో ఆ స్ఫూర్తి కొల్లబోతున్నట్లు రాష్ట్రాలవారీగా అనేక ఉదంతాలు చాటుతున్నాయి. పదిహేడు రాష్ట్రాల్లో పిల్లలకు వడ్డిస్తున్నది అరకొర భోజనమేనని పదేళ్లక్రితం కేంద్రప్రభుత్వ అధ్యయనమే ధ్రువీకరించింది. ఆ తరవాతా పరిస్థితి తేటపడలేదనడానికి- పర్యవేక్షణ లోపాలకు, మొక్కుబడి తనిఖీలకు భోజన నాణ్యత బలవుతోందన్న కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ నివేదికాంశాలే రుజువు. వేలకోట్ల రూపాయలు వెచ్చించి 11 లక్షలకుపైగా పాఠశాలల్లో సుమారు తొమ్మిది కోట్లమంది పిల్లలకు భూరి పథకం అమలు పరుస్తున్నామంటున్నా- లీటరు పాలలో నీళ్లు కలిపి 81 మందికి పంచిన యూపీ బాగోతం వంటివి దిగ్భ్రాంతపరుస్తున్నాయి. దేశవ్యాప్తంగా మూడోవంతు పిల్లల్ని పౌష్టికాహార లోపాలు కుంగదీస్తున్నాయని, ఎకాయెకి 38శాతం వయసుకు తగ్గ ఎత్తు ఎదగక గిడసబారి పోతున్నారన్న జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే- రుచికరమైన సమతుల ఆహారం ఎందరికో అందని మానిపండయిందని నిగ్గుతేల్చింది. మధ్యాహ్న భోజనంలో వరి, గోధుమల స్థానే సజ్జలు, కొర్రల వంటి చిరుధాన్యాలతో సిద్ధంచేసిన ఆహారం పిల్లల్లో యాభైశాతం అధిక వృద్ధికి దోహదపడుతుందంటున్న తాజా అధ్యయనం- మెరుగైన ప్రత్యామ్నాయాలు చేరువలోనే ఉన్నాయంటోంది!
పోషకాహారం అందిస్తున్నామా?
ఇక్రిశాట్ (అంతర్జాతీయ మెట్ట ప్రాంత పంటల పరిశోధన కేంద్రం), ‘అక్షయ పాత్ర’ల సంయుక్త అధ్యయనం చిరుధాన్యాలతో కూడిన సిద్ధాహారం పిల్లలకెంత మేలు చేయగలదో సోదాహరణంగా వెల్లడించింది. సాంబారన్నం తిన్న విద్యార్థులతో పోలిస్తే చిరుధాన్యాలతో తయారైన ఇడ్లీ, కిచిడీ, ఉప్మా వంటివి తీసుకున్నవారికి సమధికంగా పోషకాలు సమకూరాయన్న విశ్లేషణ- విస్తృత ప్రాతిపదికన దిద్దుబాటు చర్యల ఆవశ్యకతను ప్రస్ఫుటీకరిస్తోంది! అంతర్జాతీయంగా సగటున ప్రతి లక్షమందిలో 178 మందిని అంటురోగాలు, 539మందిని జీవనశైలి రుగ్మతలు బలిగొంటున్నాయి. ఇండియాలో అటువంటి మరణాలు వరసగా 253, 682గా నమోదై భీతిల్లజేస్తున్నాయి. విపరీత ఆహారపు అలవాట్లతో చిన్న వయసులోనే దాపురిస్తున్న మధుమేహం, రక్తపోటు తదితర సమస్యలకు చిరుధాన్యాలు చక్కని పరిష్కారమన్న సూచనలకు నెమ్మదిగా ప్రాచుర్యం పెరుగుతోంది. గర్భిణులు, బాలబాలికల్లో తీవ్ర అనారోగ్య లక్షణాల్ని రాగులు, కొర్రలు, సజ్జలు, సామలు వంటివి ఉపశమింపజేయగలవన్న వాదనకు ‘నీతి ఆయోగ్’ గట్టిగా వత్తాసు పలుకుతోంది. ఒకప్పుడు విరివిగా చిరుధాన్యాల వాడకానికి నెలవైన భారత్‌లో కొన్ని దశాబ్దాలుగా వరి, గోధుమల వినియోగం విస్తారంగా పెరిగింది. సహజంగానే మధ్యాహ్న భోజన పథకంలోనూ వాటికే ప్రాధాన్యం దక్కింది. పిల్లల శారీరక, మానసిక, బుద్ధి కుశలతల వికాసానికి దోహదకారి కావాలీ అంటే- మధ్యాహ్న భోజనాన్ని బలవర్ధకంగా తీర్చిదిద్దాల్సిందే. సరైన భోజనానికి, తీరైన చదువులకు కోట్లాది పసిపిల్లలు మొహం వాచిపోయే దుస్థితి సువిశాల భారతదేశానికి ఎంతమాత్రం శోభనివ్వదు. దేశమంతటా ఆ దురవస్థను చెదరగొట్టే చొరవకు- పాఠశాల విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంలో చిరుధాన్యాలు చేర్చడం సత్వరం నాంది పలకాలి!