లాక్‌డౌన్‌ను మే 31వరకు పొడగిస్తూ ఇచ్చిన మార్గదర్శకాలను నీరుగార్చొద్దని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర హోంశాఖ సూచించింది. రాష్ట్రాల అభ్యర్థనను పరిగణలోకి తీసుకునే మార్గదర్శకాలు రూపొందించినట్లు స్పష్టం చేసింది.
ఈ మేరకు మార్గదర్శకాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సీఎస్‌లకు హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా లేఖ రాశారు.
"హోంశాఖ జారీ చేసిన మార్గదర్శకాలను ఏ రాష్ట్రం కూడా నీరుగార్చొద్దు. నూతన మార్గదర్శకాలను కఠినంగా అమలు చేసేలా అధికారులను నిర్దేశించాలని రాష్ట్రాలను కోరుతున్నా. జోన్ల పరిధిలో ఉన్న పరిస్థితులను బట్టి అవసరమైతే మరిన్ని కార్యకలాపాలపై నిషేధం విధించవచ్చు. "-అజయ్ భల్లా, కేంద్ర హోంశాఖ కార్యదర్శి
కేంద్రం మార్గదర్శకాలు అనుసరించి జోన్లను నిర్ణయించే అధికారం రాష్ట్రాలకే ఉందన్న విషయాన్ని గుర్తు చేశారు భల్లా. రెడ్, ఆరెంజ్ జోన్లలో కంటైన్మెంట్, బఫర్ జోన్లను జిల్లా లేదా స్థానిక యంత్రాంగం గుర్తిస్తుందని తెలిపారు.