కొవిడ్ టీకా పంపిణీలో కేంద్ర ఆరోగ్య శాఖకు సహకరించేందుకు సిద్ధమైన హోంశాఖ.. బ్లూప్రింట్‌ను రూపొందించింది. టీకా పంపిణీ జనవరి మొదటి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉండగా.. ఈ ప్రక్రియను కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా ఆధ్వర్యంలో అధికారులు పర్యవేక్షిస్తారని విశ్వసనీయ వర్గాలు ఈటీవీ భారత్‌కు వెల్లడించాయి.
రాష్ట్రాలకు సూచనలు
కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా రాష్ట్రాలతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ముఖ్య కార్యదర్శులను కోరారు. టీకా పంపిణీకి కేంద్రం సన్నాహాలు జరుపుతోందని అధికారులకు స్పష్టం చేశారు. నిపుణుల సంఘం సూచించిన విధంగా టీకాను.. మొదట అత్యవసర సేవలు అందించేవారికి, 50 ఏళ్లు పైబడిన వారికి, 50 ఏళ్లలోపు ఉన్నా తీవ్ర ఆరోగ్య సమస్యలతో ఉన్న వారికి అందించాలన్నారు.
ఇటీవలె రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు భల్లా లేఖ రాశారు. వ్యాక్సిన్ పంపిణీ, భద్రత, రవాణ, సమాచార సేకరణ వంటి అంశాల్లో కేంద్ర ఆరోగ్య శాఖకు సహకరించాలని అందులో పేర్కొన్నారు.
టీకా పంపిణీ సమయంలో సమన్వయంతో పనిచేయడంపై హోంశాఖ, ఆరోగ్య శాఖ అధికారులు ఇప్పటికే చర్చించుకున్నారు.