ఓట్ల లెక్కింపు వేళ అల్లర్లకు అవకాశం: హోంశాఖ గురువారం జరగనున్న ఓట్ల లెక్కింపు సందర్భంగా.. దేశవ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం చేయాలని హోంమంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాల అధికారులను ఆదేశించింది. పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకునే అవకాశముందని... రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది కేంద్రం.
ఉత్తర్ప్రదేశ్, బిహార్, పశ్చిమ్ బంగ, త్రిపురలో హింసాత్మక సంఘటనలు జరిగే అవకాశం ఉందన్న సమాచారం లభించిందని తెలిపారు అధికారులు.
అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలను అప్రమత్తంగా ఉండాలని ఒక ప్రకటన విడుదల చేసింది కేంద్ర హోంశాఖ. శాంతి భద్రతలను పర్యవేక్షించాలని... ఈవీఎంలు ఉండే స్ట్రాంగ్రూంలు, ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలని సూచించింది.
లోక్సభ ఎన్నికలు ఏప్రిల్ 11- మే 19 మధ్య మొత్తం 7 దశల్లో నిర్వహించారు. మే 23న లెక్కింపు జరిపి ఫలితాలు వెల్లడించనున్నారు.
ఇదీ చూడండి: ఈవీఎంలపై కాంగ్రెస్-భాజపా మాటల యుద్ధం