వైద్య, ఆరోగ్య సిబ్బందికి కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది కేంద్ర ప్రభుత్వం. కరోనా సంక్షోభం కారణంగా వైద్యులు, ఆరోగ్య సిబ్బందిపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఈ సూచన చేసింది కేంద్రం.
ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, యూటీల ముఖ్య కార్యదర్శులకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా లేఖ రాశారు. ఈ సందర్భంగా ప్రజల విచ్చలవిడి ప్రవర్తనతో వైద్య సిబ్బంది, వారి కుటుంబాలపై జరిగిన దాడులు, సంభవించిన మరణాలను ఆ లేఖలో ప్రస్తావించారు.
"ఈ సంక్షోభ సమయంలో వైద్యులకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఆరోగ్య సిబ్బందిపై దాడులు చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి. బాధితులకు చికిత్స చేస్తూ కరోనా బారినపడి మరణించిన వైద్యులు, ఆరోగ్య సిబ్బంది అంత్యక్రియలను అడ్డుకున్న వారిని తక్షణమే శిక్షించాలి."