పర్యావరణ సమతుల్యతకు మొక్కలే ఆధారం. కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణాన్ని రక్షించేందుకు విరివిగా మొక్కలు నాటాలని, అడవులను రక్షించాలని పర్యావరణవేత్తలు ఉద్యమాలు చేస్తున్నారు. ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వాలు కూడా మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నా.. ఫలితాలు అంతంత మాత్రమే. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర నాందేడ్‌కు చెందిన ఓ కుటుంబం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మొక్కల పెంపునకు ప్రజలు ఆసక్తి చూపేలా కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. మొక్క నాటి.. దానిని చెట్టుగా మారిస్తే.. రూ. 1000 ఇస్తామని చెబుతోంది.
నాందేడ్ నగరానికి చెందిన 'హరిత్ కంధార్' అనే కుటుంబం.. పర్యావరణాన్ని కాపాడేందుకు మొక్కలు నాటాలని సంకల్పించుకుంది. ఇంటి పరిసరాలు, దారుల పక్కన విరివిగా మొక్కలు నాటి గ్రీన్ సిటీగా మార్చేందుకు కృషి చేయాలని ప్రతి ఒక్కరిని కోరింది. కానీ పెద్దగా స్పందన రాలేదు. ఈ క్రమంలో ప్రజలను భాగస్వాములు చేసేందుకు వినూత్న ఆలోచన చేసింది ఆ కుటుంబం. "మొక్క నాటు.. రూ. 1000 పట్టు" అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లింది.