దిల్లీలోని ఆమ్ఆద్మీ ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన పథకానికి సరికొత్త చిక్కులొచ్చి పడ్డాయి. దిల్లీ మెట్రో రైళ్లు, బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామన్న ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకించారు మెట్రోమ్యాన్ శ్రీధరన్. దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్-డీఎంఆర్సీకి గతంలో సారథిగా పనిచేశారు శ్రీధరన్.
''ఒకవేళ దిల్లీ ప్రభుత్వానికి మహిళలకు సహాయం చేయాలని ఉంటే.. మెట్రో రైళ్లలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం కంటే.. వారి ప్రయాణ ఖర్చును వారికే ప్రత్యక్షంగా చెల్లిస్తే మంచిదని నా సలహా'' అని ప్రధానమంత్రికి లేఖ రాశారు శ్రీధరన్.
ఈ అంశంలో మోదీని జోక్యం చేసుకోవాల్సిందిగా కోరారు.
ఎవరైనా టికెట్ తీసుకోవాల్సిందే...
దిల్లీలో మొదటి దశ మెట్రోను 2002లో ప్రారంభించినపుడు ఏ ఒక్కరికీ ప్రయాణ రాయితీని కల్పించవద్దని డీఎంఆర్సీ నిర్ణయం తీసుకున్నట్లు గుర్తు చేశారు శ్రీధరన్. అప్పటి ప్రధాని వాజ్‌పేయీ సైతం... మెట్రోను ప్రారంభించిన సమయంలో టికెట్ కొనుగోలు చేసినట్లు తెలిపారీ సివిల్ ఇంజినీర్. సిబ్బంది, ఎండీ, అధికారులు ఎవరైనా టికెట్ తీసుకోవాల్సిందేనని నొక్కి చెప్పారాయన.
దిల్లీ ప్రభుత్వ ప్రతిపాదనను అసలే అంగీకరించకూడదని మోదీని హృదయపూర్వకంగా విన్నవిస్తున్నట్లు పేర్కొన్నారు శ్రీధరన్. మహిళల ఉచిత ప్రయాణ పథకం ఇక్కడ ప్రవేశపెడితే.. దేశమంతా ఇవే డిమాండ్లు పెరిగిపోతాయనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అలా జరగడం ఏమాత్రం మంచిది కాదని లేఖలో వివరించారు శ్రీధరన్.
దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్‌పై దిల్లీ ప్రభుత్వం, కేంద్రానికి సమాన అధికారాలు ఉంటాయి. ఏ ఒక్కరూ ఏకపక్ష నిర్ణయం తీసుకోవడానికి అవకాశం లేదు. శ్రీధరన్ లేఖతో కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
ఇదీ చూడండి:బస్సులు, మెట్రోలో మహిళలకు ప్రయాణం ఉచితం!