దేశంలో మహారాష్ట్రలోనే అత్యధిక కేసులు నమోదయ్యాయి. అందులో ముంబయి తీవ్రంగా ప్రభావితమైంది. ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారిపై పోరాటానికి ప్రపంచంలోనే పెద్దదైన ఐఐటీ పూర్వ విద్యార్థుల సమాఖ్య కీలక నిర్ణయం తీసుకుంది. ముంబయిలోని మొత్తం జనాభాకు కరోనా పరీక్షలు చేసేందుకు నెలకు ఒక కోటి పరీక్షలు నిర్వహించే సామర్థ్యంతో మెగా ల్యాబ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం త్వరలోనే భాగస్వామ్య సంస్థలను గుర్తిస్తామని తెలిపింది.
ఈ నెల మొదట్లో తొలి కొవిడ్ టెస్ట్ బస్‌ను ప్రారంభించిన కౌన్సిల్.. నగరంలో రెండు సూపర్ కంప్యూటర్ క్లస్టర్లలో ఇప్పటికే ట్రయల్స్ ప్రారంభించినట్లు ప్రకటించింది. కరోనా వ్యాక్సిన్ వచ్చేందుకు ఇంకా ఏడాదికిపైగా సమయం పడుతుందని భావిస్తున్న నేపథ్యంలో పరీక్షల సామర్థ్యం ఒక పెద్దసవాలుగా మారింది. సకాలంలో పరీక్షలు చేయటం, నిర్ధరించటం, నివారించటం, సరైన సమయంలో చికిత్స అందించటం ఈ ల్యాబ్ ముఖ్య ఉద్దేశం.
ఐఐటీ కాన్పుర్ పూర్వ విద్యార్థి, ప్రిన్సిపల్ సైంటిఫిక్ ఆఫీసర్ కే. విజయ్ రాఘవన్ నేతృత్వంలో కొవిడ్-19 టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది మండలి. ఇందులో 20 మంది ఐఐటీ డైరెక్టర్లతో పాటు పలువురు పూర్వ విద్యార్థులు సభ్యులుగా ఉండనున్నారు. ఐఐటీ పూర్వ విద్యార్థుల మండలిలో 23 ఐఐటీలకు చెందిన విద్యార్థులు, అధ్యాపకులు ఉన్నారు.