తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అరటి చెట్టుతో జీవ విద్యుత్.. యువ మేధావి ప్రతిభ - అరటి చెట్ల కాండాల నుంచి విద్యుత్తు

జీవితంలో కష్టాలనే విజయానికి సోపానంగా మార్చుకోవాలన్న నానుడికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు బిహార్​కు చెందిన 19 ఏళ్ల విద్యార్థి. చిన్నతనంలో కుటుంబానికి జరిగిన నష్టాన్ని తన మేథస్సుతో ఉపయోగకరంగా మార్చాడు. కష్టాల కడలిని విజ్ఞానమనే పడవతో దాటి యువశాస్త్రవేత్తగా ఎదిగి చదువు ప్రాధాన్యాన్ని మరోసారి గుర్తు చేశాడు. ఆ యువమేధావి విజయగాథేమిటో మీరే చూడండి.

young
అరటి చెట్టుతో జీవ విద్యుత్.. యువ మేధావి

By

Published : Feb 6, 2020, 7:31 AM IST

Updated : Feb 29, 2020, 8:59 AM IST

అరటి చెట్టుతో జీవ విద్యుత్.. యువ మేధావి ప్రతిభ

సంకల్పంతో ముందుకు సాగితే వయసుతో సంబంధం లేకుండానే విజయం వరిస్తుందని నిరూపించాడు బిహార్​ బగల్​పుర్​ జిల్లా ధ్రువ్​గంజ్​కు చెందిన 19 ఏళ్ల గోపాల్​. విజ్ఞానశాస్త్రంలో అపారమైన ప్రతిభను చూపి యువ శాస్త్రవేత్తగా అందరి మన్ననలు పొందుతున్నాడు. అరటిచెట్టు కాండం, చిత్తు కాగితాల నుంచి విద్యుత్తు​ను ఉత్పత్తిచేసి ఔరా అనిపిస్తున్నాడు.

నష్టం నుంచి కష్టాన్ని దాటాడు..

2008లో వచ్చిన వరదలు గోపాల్ కుటుంబానికి చెందిన అరటితోటను పూర్తిగా ధ్వంసం చేశాయి. ఆర్థికంగా ఛిన్నాభిన్నమైన కుటుంబం మరో పంట వేసేందుకు అరటిమొద్దులను తొలగిస్తుండగా 13 ఏళ్ల బాలుడైన గోపాల్ మెదడులో విద్యుచ్ఛక్తి ఆలోచన తళుక్కున మెరిసింది. బయటపడేసిన అరటిమొద్దులు, చిత్తు కాగితాల నుంచి జీవకణాలను సేకరించి.. ఎలక్ట్రోడ్ల సాయంతో వాటిలో ఉన్న జీవశక్తిని కరెంట్​గా మార్చేశాడు. అలా 13 ఏళ్ల వయస్సులోనే జీవ విద్యుత్తును తయారుచేసిన గోపాల్ అనంతరం తన ప్రయోగాన్ని మరింత అభివృద్ధిపరిచాడు. కాలుష్యరహిత విద్యుత్తును చౌక ధరకే తయారుచేసి అందరి మన్ననలు పొందాడు.

ప్రపంచ విద్యాసంస్థల ఆహ్వానం

గోపాల్​ మేధా శక్తి, అతని ఆవిష్కరణల గురించి తెలుసుకున్న ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్​ఫర్డ్ విశ్వవిద్యాలయం​, న్యూ జెర్సీ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్ టెక్నాలజీ వంటి విద్యాసంస్థలు తమతో కలిసి పరిశోధనలు చేసేందుకు గోపాల్​ను ఆహ్వానించాయి. కానీ వారి​ ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించాడు గోపాల్. 2017లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. గోపాల్​కు అహ్మదాబాద్​లోని నేషనల్​ ఇన్నోవేషన్​ ఫౌండేషన్​లో పరిశోధనలు చేసేందుకు గానూ ఓ ప్రయోగశాల సౌకర్యాన్ని కల్పించారు. ప్రస్తుతం అక్కడే తన పరిశోధనలు సాగిస్తున్నాడు గోపాల్.

"అమెరికా,చైనా, జపాన్​ వంటి అభివృద్ధి చెందిన దేశాల విద్యాసంస్థలు అనేక సార్లు అవకాశమిస్తామంటూ ముందుకువచ్చాయి. మాతో కలిసి పరిశోధనలు చేయమని కోరాయి. ఉచిత వసతి, ప్రయోగశాల, ప్రోత్సాహక వేతనం​ ఇస్తామని అన్నాయి. కానీ నేను ఈ విధంగా ఆలోచించాను.. మన ఇళ్లు మురికిగా ఉంటే అలా వదిలేయలేము.. శుభ్రపరుచుకుంటాం. అలాగే మన దేశంలో పరిశోధనల కొరత ఉంది. చాలా మందికి వీటిపై అవగాహన లేదు. అందుకే స్వదేశంలో ఉంటూ నాలాంటి ఎంతో మంది విద్యార్థులకు తోడ్పడటం నా కర్తవ్యమని తలచాను."

- గోపాల్, పరిశోధకుడు.

గెలుచుకున్న పురస్కారాలు

గోపాల్​ అపారమైన ప్రతిభను గుర్తించిన పలు శాస్త్ర సాంకేతిక విద్యాసంస్థలు అనేక అవార్డులు అందించాయి. భారత ప్రభుత్వ సాంకేతిక, విజ్ఞాన శాస్త్ర విభాగం అతనికి స్ఫూర్తిప్రదాత పురస్కారాన్ని ఇచ్చింది. ప్రఖ్యాత ఐ-స్మార్ట్​ కంపెనీకి గోపాల్​ను ప్రచారకర్తగా ఎంపిక చేశారు. ప్రస్తుతం గోపాల్​ గ్రాఫిక్​ ఎరా విశ్వవిద్యాలయంలో అణుధార్మికత తగ్గింపు దిశగా 'గోపాల్స్​కా' అనే పరిశోధన చేస్తున్నాడు. దీనితో పాటు పలు శాస్త్ర సాంకేతిక అంశాలపై అధ్యయనం కొనసాగిస్తున్నాడు.


ఇదీ చూడండి: 200 అడుగుల హైవోల్టేజ్​ టవర్​పైనుంచి జంప్​!

Last Updated : Feb 29, 2020, 8:59 AM IST

ABOUT THE AUTHOR

...view details