కొన్ని కొన్ని సంఘటనలు మనిషి జీవితాన్నే మార్చేస్తాయి. అవే మనల్ని సాధారణ మనుషుల నుంచి ఆసాధారణ వ్యక్తులుగా మారుస్తాయి. దిల్లీవాసి హిమాన్షు కలియా కథ కూడా ఇంతే. కొన్నేళ్ల క్రితం తన తండ్రికి జరిగిన ఓ రోడ్డు ప్రమాదం.. హిమాన్షును కుదిపేసింది. దాంతో ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మొదలు పెట్టిన ఆయన.. ఇప్పుడు "అంబులెన్స్ మ్యాన్"గా ప్రసిద్ధి చెందారు.
ఆ ఒక్క సంఘటన...
హిమాన్షు కలియాకు.. తన గతం ఎన్నో పాఠలు నేర్పింది. 14 ఏళ్ల వయస్సులో హిమాన్షు తండ్రి దిల్లీలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వెంటనే ఘటనా స్థలానికి పరుగులు తీశారు హిమాన్షు. రిక్షా సాయంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు. పెద్దాసుపత్రికి తీసుకెళ్లాలని అక్కడి వైద్యులు సూచించారు.
ఆ సమయంలో హిమాన్షుకు సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. తండ్రిని వేరే ఆసుపత్రికి తీసుకెళ్లడానికి అంబులెన్స్ దొరకలేదు. చాలా సేపటిని ఓ ఆటో డ్రైవర్.. హిమాన్షుకు దేవుడిలా ఎదురయ్యాడు. ఎలాంటి ఛార్జీలు తీసుకోకుండానే.. తన తండ్రిని దిల్లీ ఎయిమ్స్‌కు తీసుకెళ్లాడు.
కానీ అప్పటికే ఆలస్యమైంది. హిమాన్షు తండ్రి కోమాలోకి వెళ్లిపోయారు. అందులో నుంచి బయటపడి.. రెండున్నరేళ్లకు కోలుకున్నారు.
ఈ సంఘటన హిమాన్షు జీవితాన్నే మార్చేసింది. యాక్సిడెంట్ సమయంలో తండ్రి ప్రాణాలు కాపాడమని అన్ని దేవుళ్లను ప్రార్థించిన హిమాన్షు... ఆ తర్వత తనకు జరిగినట్టు ఇంకెవరికీ జరగకూడదని కోరుకున్నారు. ఆపదలో ఉన్న వారికి సహాయం చేసే శక్తి తనకు ఇవ్వని దేవుడిని వేడుకున్నారు.