పేద విద్యార్థులకు శానిటరీ ప్యాడ్లు పంచుతూ.. నెలసరి సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు ప్రచారం చేస్తూ 'ప్యాడ్ బామ్మ'గా గుర్తింపు పొందారు గుజరాత్ సూరత్‌కు చెందిన మీనా మెహతా. గర్భాశయ క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న ఆమెను ప్రధాని నరేంద్ర మోదీ సైతం ప్రశంసించారు. మహిళల అభివృద్ధిలో.. భర్త అతుల్ మెహతాతో కలిసి ఆమె సాధించిన ఘనతలను ఈటీవీ భారత్‌తో పంచుకున్నారు మీనా.
"నా పేరు మీనా మెహతా. మానూని ఫౌండేషన్ స్థాపకురాలిని. గత ఏడేళ్లుగా 11 నుంచి 14 ఏళ్ల బాలికలకు నేను శానిటరీ ప్యాడ్లు ఉచితంగా పంచుతున్నాను. అప్పుడే రుతుక్రమం ప్రారంభమయ్యే పిల్లలకు ప్యాడ్‌ను ఎలా ఉపయోగించాలి, దాన్ని ఎలా పారేయాలి, ఎన్ని గంటలకోసారి ప్యాడ్ మార్చాలో అన్నీ నేర్పుతున్నాను. ఇప్పుడు పిల్లలు పూర్తిగా నేర్చేసుకున్నారు కూడా.
మొదటి నుంచి మేము ప్రభుత్వ పాఠశాలల్లో బాలికలకు ఉచితంగా పంచుతున్నాము. ఎందుకంటే వారికి డబ్బులు వెచ్చించి ప్యాడ్లు కొనుక్కునే స్తోమత ఉండదు. ఇప్పటి వరకు మేము దాదాపు 4 లక్షల ప్యాడ్లను ఉచితంగా పంచాము.
ఏడేళ్ల క్రితం ఓ బాలిక చెత్తబుట్టలోంచి రెండు ప్యాడ్లను తీస్తూ కనిపించింది. నేను అడిగినప్పుడు తను చెప్పింది విని నాకు ఆశ్చర్యం కలిగింది. బామ్మ మేము ప్రతి నెలా.. ఇలా వాడిపడేసిన ప్యాడ్లను తీసుకుని వాటిని నీటితో కడిగి మేము వాడతామని తను చెప్పింది. ప్రతి నెలా అమ్మాయిలకు కావలసిన ప్యాడ్లను ఎవ్వరూ పట్టించుకోరని అప్పుడే నాకు అర్థమైంది. వారి ఆరోగ్యాలకు ఇదెంతో అవసరం. కాబట్టి మేము చేపట్టిన ఈ కార్యక్రమాలతో ప్రజల్లో ఎంతో మార్పు వచ్చింది. బాలికలు వారి తల్లులకు ప్యాడ్‌ను ఉపయోగించడం నేర్పిస్తున్నారు. ఇప్పుడు వారి నెలవారి సరుకుల జాబితాలో ప్యాడ్లు చేరిపోయాయి.