కొవిడ్‌పై అవగాహన కల్పించడంలో మీడియా అసాధారణమైన సేవలు అందిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. సానుకూల విమర్శలు చేయడం, విజేతల గాథలను ప్రజలకు చేరవేయడం ద్వారా భారత ప్రజాస్వామ్య నైతికతకు మీడియా బలం చేకూరుస్తోందని ప్రశంసించారు. ప్రజాస్వామ్య పునాదులను బలోపేతం చేయడంలో మీడియా కీలకంగా వ్యవహరిస్తోందని అన్నారు. జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి లిఖితపూర్వకంగా తన సందేశాన్ని అందించారు.
"అవగాహన కార్యక్రమాలతో పాటు, సమాజంలో సంస్థాగత మార్పులు తీసుకొచ్చేందుకు మీడియా పోషించిన పాత్రను మనం గుర్తించాం. స్వచ్ఛభారత్, నీటి సంరక్షణ సహా ప్రభుత్వ కార్యక్రమాలకు సహాయపడటాన్ని మనం చూశాం. కొవిడ్ అనంతర పరిస్థితుల్లో దేశం ఆత్మనిర్భర్ భారత్‌గా రూపాంతరం చెందుతుంది. ఈ సంకల్పాన్ని ప్రజలకు చేరవేసేలా ప్రచారం చేసేందుకు మీడియా ఉపయోగపడుతుంది."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
కరోనావైరస్ గురంచి ప్రజలకు అవగాహన కల్పించి, వ్యాప్తిని నివారించడంలో మీడియా సిబ్బంది కీలక పాత్ర పోషించారని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పేర్కొన్నారు. కరోనా యోధుల్లో ముందువరుసలో ఉన్నారని కొనియాడారు. జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా లిఖితపూర్వక లేఖ విడుదల చేసిన కోవింద్.. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీసీఐ)ను ప్రశంసించారు.
"'పీసీఐ తన 55 ఏళ్ల అనుభవంలో పత్రికా స్వేచ్ఛను రక్షిస్తూ.. నాణ్యమైన జర్నలిజం కొనసాగేలా కృషి చేసింది. ప్రజాస్వామ్యంలో వీరి పాత్ర కీలకమైనది. కొవిడ్ సంబంధిత సమస్యల విషయంలో మీడియా చాలా కీలక పాత్ర పోషించింది. ప్రజలకు అవగాహన కల్పించి వైరస్ ప్రభావాన్ని తగ్గించేందుకు తోడ్పడింది. కరోనా యోధుల్లో మీడియా సిబ్బంది ముందువరుసలో ఉన్నారు. పీసీఐ ద్వారా వారందరికీ నా తరఫున ప్రశంసలు చెబుతున్నాను."