విద్య, ఉపాధి అవకాశాల కోసం విదేశాలకు వెళ్లిన భారతీయులు.. ప్రపంచవ్యాప్తంగా 1.75 కోట్ల మంది ఉన్నట్లు ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. 2019 సెప్టెంబర్లో డిపార్టమెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ సోషియల్ ఎఫైర్స్ (డీఈఎస్‌ఏ) ఈ గణాంకాలను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ సంఖ్య మరింత పెరిగి రెండు కోట్లకు చేరి ఉంటుందని విశ్లేషకుల అంచనా.
కరోనా సంక్షోభం కారణంగా వివిధ దేశాల్లో ఉన్న భారతీయులు స్వదేశానికి రావడానికి అధిక సంఖ్యలో మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే పలు దేశాల్లో ఉన్న భారతీయులు ఆయా దేశాల్లోని దౌత్యకార్యాలయాలను సంప్రదించి తమను భారత్‌కు పంపాలని అభ్యర్థిస్తున్నారు.
వైద్య సదుపాయల లేమి..
అంతేకాకుండా.. కరోనా పరీక్షలు పూర్తి స్థాయిలో చేసేందుకు చాలా దేశాలకు తగిన శక్తి సామర్థ్యాలు లేవు. ఇప్పటికే కువైట్‌కు భారత్ దేశం నుంచి వైద్యులు, నర్సులను తరలించి కరోనా పరీక్షలు చేయిస్తుండగా మరికొన్ని దేశాలు కూడా భారత్ సాయం కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో విదేశాల్లోని భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలను కేంద్రం మొదలు పెట్టింది.
ఎక్కడెక్కడ ఎంతమంది..
ప్రపంచవ్యాప్తంగా ఉన్నత విద్య, ఉపాధి, విజిట్, పర్యటక వీసాలపై వెళ్లిన వారి వివరాలను ఆయా దేశాల్లోని దౌత్య కార్యాలయాల ద్వారా సేకరిస్తోంది భారత్. ఇవి కాకుండా ఆయా దేశాల్లో స్థిరపడి, అక్కడి పౌరసత్వం పొందినవారు... కరోనా నేపథ్యంలో స్వదేశానికి వస్తామని అభ్యర్థిస్తున్నవారి గురించి ఆరా తీస్తోంది. రకరకాల అవసరాల కోసం వివిధ దేశాలకు వెళ్లిన వారు ఎంత మంది ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్ని దేశాల్లోని వారిని తీసుకురావాలా? కొవిడ్- 19 తీవ్రతను బట్టి, స్థానిక పరిస్థితులను బట్టి ఏయే దేశాల నుంచి తరలించాలన్న అంశాలపై కేంద్రం తీవ్రంగా పరిశీలిస్తోంది.