మాథ్యూస్ అబ్రహం ఇంట్లో నుంచి రెండు బైబిళ్లు తీసుకొస్తే.. వాటిల్లో తేడాలు కనిపెట్టడం కష్టమే! ఒకటి ముద్రించినది, రెండోది ఆయన స్వయంగా చేతితో రాసింది. అయినా ఆ గ్రంథాలు ఒకేలా ఉంటాయి. ఎందుకంటే 66 ఏళ్ల వయసులోనూ ఆయన బైబిల్ను అచ్చుగుద్దినట్లు చేతితో రాస్తున్నారు. అంతేకాదు ఆ పవిత్ర గ్రంథంలోని పటాలనూ చక్కగా గీసేస్తున్నారు. ఇందుకు ఏకంగా నాలుగేళ్లు శ్రమించారు.
కొట్టారక్కరలోని త్రికన్నమంగళ్కు చెందిన విశ్రాంత ఎకనామిక్స్ ప్రొఫెసర్ మాథ్యూస్ అబ్రహం. పదవీ విరమణ తర్వాత మొత్తం బైబిల్ను చేత్తో రాయాలనే ఆలోచన వచ్చింది. వెంటనే రాయటం మొదలుపెట్టారు. అయితే రాతపై పట్టు సంపాదించిన ఆయన.. ప్రస్తుతం ప్రింటెడ్ వెర్షన్ను పోలినంతగా తన అక్షర శైలిని మార్చుకున్నారు. బెంగళూరు బైబిల్ సొసైటీ ప్రచురించిన 266 పేజీల కొత్త నిబంధన, 902 పేజీల పాత నిబంధన బైబిల్ను అచ్చుగుద్దినట్లు రాయడమే కాకుండా వాటిల్లోని మ్యాప్లనూ యథావిధిగా గీసేశారు.