వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపుపై ఇచ్చిన తీర్పు పునఃసమీక్షించాలంటూ ప్రతిపక్షాలు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ను సుప్రీంకోర్టు అంగీకరించింది. పిటిషనర్ల తరపు న్యాయవాది, కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ విజ్ఞప్తి మేరకు... వచ్చే వారం దీనిపై విచారణ చేపట్టనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయి నేతృత్వంలోని ధర్మాసనం తక్షణ విచారణ జాబితాలో ఈ పిటిషన్ ఉంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో.. 21 ప్రతిపక్ష పార్టీలు ఈ పిటిషన్ను దాఖలు చేశాయి. సార్వత్రిక ఎన్నికల్లో లెక్కించాల్సిన వీవీప్యాట్ రసీదుల సంఖ్యను పెంచాలని కోరారు. అంతకుముందు ప్రతి నియోజకవర్గంలో 50 శాతం వీవీప్యాట్ రసీదులను లెక్కించేలా ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేయాలని కోర్టుకు విన్నవించారు. వ్యాజ్యంపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఎన్నికల సంఘాన్ని వివరణ కోరింది.