ప్రపంచాన్ని మొత్తం కరోనా వైరస్ ఆవహించింది. దేశాలన్నీ లాక్డౌన్ గుప్పిట ఉన్నాయి. ఈ నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాలంటే మాస్క్ తప్పనిసరి అవుతోంది. కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు మాస్కు ఓ ఆయుధంలా ఉపయోగపడటమే కాక.. లాక్డౌన్ వేళ ఉపాధి కోల్పోయిన కార్మికులకు జీవనాధారంగా మారింది.
కేరళలో సూక్ష్మ పరిశ్రమలకు నేతృత్వం వహిస్తున్న 300 మంది మహిళలు ఇప్పటివరకు 14.50 లక్షల మాస్కులను తయారు చేశారు. పేదరికాన్ని పారదోలడానికి కేరళ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'కుడుంబశ్రీ' పథకం కింద వీరు ఈ మాస్కులు రూపొందించారు. లేయర్ల సంఖ్యను బట్టి ఒక్కో మాస్కు రూ.10 నుంచి రూ.15 మధ్య విక్రయిస్తున్నారు. ఈ విక్రయాల ద్వారా రూ.2 కోట్ల టర్నోవర్ వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. వివిధ ప్రభుత్వ శాఖలు సహా, పలు సంస్థల నుంచి పెద్ద ఎత్తున ఆర్డర్లు వస్తున్నట్లు నిర్వహకులు చెబుతున్నారు.
స్వచ్ఛందంగా
ఈ బృహత్తర కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థలూ తమ వంతు సహాయం చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నాయి. మహిళలకు చేయూతనిచ్చేలా 2018లో శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసినట్లు 'సేవ్ ది చిల్డ్రన్' సంస్థ పేర్కొంది. వాటిలో శిక్షణ పొందిన మహిళలు ఇప్పుడు మాస్కులు తయారీ చేస్తున్నట్లు తెలిపింది.
"మహిళలందరూ ఈ కేంద్రాల్లో శిక్షణ పొందారు. వారి సహాయార్థం మెటీరియల్ అందించాం. ఇప్పుడు వారు మాస్కులు తయారు చేస్తున్నారు. ఈ శిక్షణ యూనిట్లు.. సంక్షోభ పరిస్థితుల్లో సమాజానికి సేవ చేయడమే కాకుండా పేదరికంలో ఉన్న మహిళలకు జీవనాధారం అందిస్తున్నాయి."
-అనిదిత్ రాయ్, సేవ్ ద చిల్ట్రన్ డైరెక్టర్ ప్రోగ్రామ్స్