కొవిడ్-19 (కరోనా వైరస్) ప్రభావం నేపథ్యంలో మాస్క్‌లు, శానిటైజర్లను నిత్యావసర వస్తువుల జాబితాలో చేర్చింది కేంద్ర ప్రభుత్వం. వైరస్ ప్రభావం అధికమవుతున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.
గతేడాది జూన్ 30న నిత్యావసర వస్తువుల జాబితాను సవరిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయని వాటిని వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశించింది. సర్జికల్ మాస్క్‌లు, ఎన్-95 మాస్క్‌లు, హ్యాండ్ శానిటైజర్లను సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంచాలన్న కేంద్రం వీటిపై ఎలాంటి కొరత లేకుండా జాగ్రత్త వహించాలని పేర్కొంది.
సరసమైన ధరలకే..
మాస్క్‌లు, శానిటైజర్లను సరసమైన ధరలకే అందించాలని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ నియమాలు తప్పక పాటించాలన్న కేంద్రం అమలుచేయని వారిపై చట్టపరమైన చర్యలకు వెనకాడొద్దని అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.
విరివిగా ప్రచారం చేయండి..
ఇప్పటికే ఏర్పాటు చేసిన అన్ని సహాయ కేంద్ర నంబర్లు, నిత్యావసర వస్తువుల జాబితాను ప్రజలకు వివరించాలని కోరింది. కొత్తగా చేర్చిన అంశాలు, తప్పని సరిగా అందుబాటులో ఉంచాల్సిన వస్తువుల జాబితాను ప్రజలకు అర్థమయ్యేలా విరివిగా ప్రచురించాలని ఆదేశించింది వినియోగదారుల మంత్రిత్వశాఖ.
ఇదీ చదవండి:కరోనా బారిన పడకుండా ఉండాలా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి